-రూ.1,395 కోట్లతో 3 లక్షల 75 వేల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ అమలుకు చర్యలు
-వైఎస్సార్ యంత్ర సేవ పథకం క్రింద 3,500 ట్రాక్టర్లు త్వరలో పంపిణీ
-రూ.46 కోట్లతో గన్నవరంలో స్టేట్ సీడ్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్
-ఆర్.బి.కె.ల్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల రైతుల ఖాతాలు అనుసంధానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతుల సంక్షేమం, అభ్యున్నతికి సంబంధించి కీలకమైన నాలుగు పైళ్లపై సంతకం చేశారు. తదనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. డా.పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తో పాటు ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మార్కెంటింగ్ శాఖల అధికారులు, పలువురు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతో ప్రధానమైన వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిందుకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 70 శాతం కుటుంబాలు వ్యవసాయమే జీవనాధారంగా గడుపుతున్నారని, అటు వంటి కీలక శాఖకు మంత్రిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అన్ని శాఖల కంటే అధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 43 వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం వ్యవసాయ శాఖకు కేటాయించిదన్నారు. ఇందులో వ్యవసాయ శాఖకు రూ.12,287 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.554 కోట్లు, పట్టుపరిశ్రమకు రూ.100 కోట్లు, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421 కోట్లు, డా.వైఎస్సార్ ఉద్యానవన విశ్వద్యాలయానికి రూ.60 కోట్లు, సహకార శాఖకు రూ.248 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.614 కోట్లు, పుడ్ ప్రాసెసింగ్ కు రూ.146 కోట్ల మేర నిధులను కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నదని, రైతుభరోసా-పిఎం కిసాన్ కార్యక్రమం క్రింద సుమారు 52 లక్షల రైతు కుటుంభాలకు లబ్దిచేకూర్చే విధంగా రూ.20,117 కోట్లను నగదు బదిలీ గా నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయడమే అందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. అదే విధంగా ఇప్పటి వరకు సున్నా వడ్డీ పథకం క్రింద 58 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,282 కోట్లను, పంట భీమా పథకం క్రింద 31 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,707 కోట్లను, ఇన్పుట్ సబ్సిడీ క్రింద 14 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,612 కోట్లను అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని రైతులు అనేక రోజులుగా ఎదురుచూస్తున్న డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కు సంబందించి రూ.1,395 కోట్లతో 3 లక్షల 75 వేల ఎకరాల్లో అమలు పర్చేందుకు తొలి సంతకం చేయడమైందని, సాద్యమైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వైఎస్సార్ యంత్ర సేవ పథకం క్రింద 3,500 ట్రాక్టర్లను మంజూరు చేసేందుకు రెండో సంతకం చేయడం జరిగిందని, జిల్లాల వారీగా ఈ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ నుండే జెండా ఊపి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేసి పెద్ద ఎత్తున దిగుబడులను పెంచాలనే లక్ష్యంతో స్టేట్ సీడ్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను రూ.46 కోట్లతో గన్నవరంలో ఏర్పాటు చేసేందుకు మూడో సంతకం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. త్వరలో ఈ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయడం జరుగుచున్నదని, అయితే ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలలోని రైతుల ఖాతాలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేసి నగదు లావాదేవీలను కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకునే విధంగా ప్రతిపాదించిన పైల్ పై కూడా సంతకం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అమల్లో బాగంగా ప్రతి రైతుకు 50 శాతం రాయితీ పై స్ప్రింక్లర్లను అందజేయడం జరుగుతుందన్నారు. అయితే ఐదు ఎకరాల్లోపు ఉన్న చిన్న, మధ్య తరగతి రైతులకు 90 శాతం రాయితీపై, రాయలసీమ, ప్రకాశం జిల్లాలోని ఐదు నుండి పదెకరాల్లోపు ఉన్న రైతులకు 70 శాతం రాయితీ పై, ఐదెకరాల నుండి పన్నెండు ఎకరాలలోపు ఉన్న తీర ప్రాంత మధ్య తరగతి రైతులు అందరికీ 50 శాతం రాయితీపై స్ప్రింక్లర్లను సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.