Breaking News

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : డిప్యూటీ సియం నారాయణస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు జరిగాయి.ఈకార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పినిపే విశ్వరూప్,మాజీమంత్రి,ఎంఎల్సి డొక్కా మాణిక్య వరప్రసాద రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.మనకు బిఆర్ అంబేద్కర్,బాబూ జగజ్జీవన్ రామ్ ఇద్దరూ రెండు కళ్ళు అని కావున వారి ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.విజయవాడలో అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.రాష్ట్రంలో ఎస్సి,ఎస్టి బిసి తదితర పేద వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఎనలేని సేవలందిస్తూ అంబేద్కర్ కు అసలైన వారసునిగా నిరూపించుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు.

రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ అంబేద్కర్ చిన్న వయస్సులో అనేక కష్టాలను ఎదుర్కొని ఉన్నత విద్యావంతుడై ప్రపంచ మేధావిగా ఎదగడమే గాక మంచి ముందుచూపు ఉన్న వ్యక్తని పేర్కొన్నారు.దేశానికి హైదరాబాదును రెండవ రాజధానిగా చేస్తే అసలు తెలంగాణా ఉద్యమం అనేదే ఉండదని ఎంతో ముందు చూపుతో అంబేద్కర్ ఆనాడే చెప్పాడని గుర్తుచేశారు.రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలుచేసే వ్యక్తులు సరిగా లేకుంటే ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని,అంబేద్కర్ ఆశయాల సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని చెప్పారు.మహిళల హక్కుల కోసం,కార్మికుల సంక్షేమానికి అంబేద్కర్ విశేష కృషి చేశారని మంత్రి విశ్వరూప్ గుర్తు చేశారు.

సమావేశంలో మాజీమంత్రి,ఎంఎల్సి డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలు రొజురోజుకూ మరింత పెరుగుతున్నాయని చెప్పారు.ప్రపంచ వ్యాప్తంగా కారల్ మార్క్స్,జాతిపిత మహాత్మాగాంధీ,బిఆర్ అంబేద్కర్లపై ఎక్కువ డిబేట్లు జరుగు తున్నాయని అన్నారు.జాతిపితగా మహాత్మాగాంధీ పేరుగాంచితే విశ్వగురువుగా బిఆర్ అంబేద్కర్ పేరుగాంచారని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే కేవలం ఎస్సి,ఎస్టిలకు రిజర్వేషన్లు తెచ్చాడని కావున వారికి సంబంధించిన వ్యక్తేనని అనుకోరాదని అందరికి సంబంధించిన వాడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.దేశానికి మంచి రాజ్యాంగాన్ని అందించడమేగాక అనేక సంస్థలు,వ్యవస్థల ఏర్పాటుకు కారకుడు అంబేద్కరని గుర్తు చేస్తూ రిజర్వు బ్యాంకు,ఎన్నికల కమీషన్,ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లు వంటివి ఏర్పాటు చేశారని అన్నారు.హిందూకోడ్ బిల్లును తేవడంతో పాటు దామోదర్ రివర్ వ్యాలీ ప్రాజెక్టును,సెంట్రల్ వాటర్ బోర్డు,రివర్ బేసిన్ కాన్సెప్ట్ వంటివి ఏర్పాటుకు అంబేద్కర్ కారకుడని తెలిపారు. అంతేగాక 1956 అంతర్ రాష్ట్ర నీటివివాద చట్టాన్ని కూడా ఆయనే తెచ్చారన్నారు.అలాగే మహిళల హక్కులకై పోరాడడం తోపాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పోరాడారని చెప్పారు.

సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప సంస్కర్త,మంచి యాక్టివిస్టని అని పేర్కొన్నారు.ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు.రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి వీరపాండ్యన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించడంతో పాటు ప్రతి రోజు అంబేద్కర్ ను స్మరించు కోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమానికి ఉద్యోగుల సంఘం అదనపు కార్యదర్శి కత్తి రమేశ్ స్వాగతం పలుకగా కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెంకటసుబ్బయ్య,మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు సత్య సులోచన,అసెంబ్లీ ఉద్యోగుల సంఘం ప్రతినిధి వరప్రసాద్,ఇంకా ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *