Breaking News

సంపూర్ణ విద్యా కేంద్రాలుగా అంబేద్కర్ గురుకులాలు

-సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు
-ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన మంత్రి మేరుగు నాగార్జున

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంబేద్కర్ గురుకులాల ద్వారా విద్యార్థులకు సంపూర్ణ విద్యా వికాసాలను అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. గురుకులాల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వసతుల మేరకు సీట్లను పెంచే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. అంబేద్కర్ గురుకులాల్లో 5 వ తరగతి, జూనియర్ ఇంటర్ లలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలను మంత్రి నాగార్జున బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ, అంబేడ్కర్ గురుకులాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం, భద్రత, కాస్మెటిక్స్ అలవెన్సులు, అటల్ టింకరింగ్ లాబ్స్ ద్వారా ప్రయోగాలు, కంప్యూటర్ శిక్షణ, స్వీయ రక్షణ పద్దతులు, యోగ, స్పోర్ట్స్, వృత్తి విద్య, ఇంగ్లీష్ భాషా శిక్షణ లలో ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నామని తెలిపారు. సంపూర్ణ స్థాయి లో విద్యార్థులకు తమ గురుకులాల్లో శిక్షణలు ఇస్తున్న కారణంగానే గురుకులం లో సీట్లకు డిమాండ్ ఏర్పడిందని నాగార్జున అభిప్రాయపడ్డారు. దీనికి తోడుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసుకుంటున్న చర్యలు, ప్రవేశ పెడుతున్న విశిష్టమైన పథకాల కారణంగా కూడా గురుకుల విద్య పై తల్లితండ్రులలోనూ, విద్యార్థులలోనూ ఆసక్తి పెరిగిందని చెప్పారు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు కూడా చూపనంత ఎక్కువ శ్రద్ధ ముఖ్యమంత్రి చూపుతున్నారని ప్రశంసించారు. సీఎం చేస్తున్న ఈ కృషి కారణంగా పేద పిల్లలను కూలికి పంపకుండా పాఠశాలలకు పంపి చదివించాలనే ఆలోచన తల్లిదండ్రుల్లో పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. తమ గురుకులాల్లో 5 వ తరగతి లో ఉన్న 14,940 సీట్ల కోసం 61,670 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ లో ఉన్న 13,560 సీట్ల కోసం 42,831 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. 188 కేంద్రాలలో దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్షలను గత నెల 24 న నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చునని నాగార్జున పేర్కొన్నారు. పరీక్షల ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా విద్యార్థులకు పంపనున్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న వసతుల మేరకు అవసరమైన చోట సీట్లను పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి వివరించారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లికార్జున నాయక్, అంబేడ్కర్ గురుకులాల కార్యదర్శి ఆర్. పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *