-దేవాలయాల్లో అవినీతి నిర్మూలనకు ఐ.జి.స్థాయి అధికారితో విజిలెన్సు సెల్
-ప్రముఖ దేవాలయాలను ప్రణాళికాబద్దంగా అభివృద్దిచేసేందుకు మాస్టర్ ప్లాన్
-ధూపదీఫనైవేద్యం పథకం క్రింద అందిన 653 ధరఖాస్తులు త్వరలో పరిష్కారం
-దేవాదాయ శాఖకు రావాల్సిన సి.జి.ఎఫ్. దాదాపు రూ.90 కోట్ల వసూలుకు చర్యలు
-కామన్ గుడ్ ఫండ్ (సి.జి.ఎఫ్.)తో చేపట్టిన 184 పనులు సకాలంలో పూర్తికి చర్యలు
-ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో దేవాదాయ భూముల ఆక్రమణల నియంత్రణకు త్వరలో చట్టసవరణ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ నేడు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.5 లక్షల ఆదాయంలోపు ఉన్న దేవాలయాలకు ఒక లక్షా 58 వేల ఎకరాల భూములు ఉన్నాయని, ఆక్రమణల్లో ఉన్న 2 లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలు అర్చకుల యాజమాన్యంలో ఉన్నాయన్నారు. అయితే దేవాదాయ భూముల ఆక్రమణను పటిష్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్టం సెక్షన్-83 మరియు 84 నిబంధనలలో కొన్ని ఆటంకాలు ఉన్నట్లు గుర్తించడమైందన్నారు. ఎండోమెంట్ చట్టంలోని లోపాలను సవరించి ఆ చట్టాన్ని మరింత పటిష్ట వంతంగా తీర్చిదిద్ది దేవాదాయ భూముల ఆక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు రానున్న కేబినెట్ లో ఎండోమెంట్ చట్టసవరణకు ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని దేవాలయాల్లో ఎటు వంటి అవినీతి, అక్రమాలను తావులేకుండా ఐ.జి.స్థాయి అధికారితో ఒక విజిలెన్సు సెల్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచలో ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రధాన దేవాలయాలతో పాటు మరో 31 ప్రముఖ దేవాలయాల ఉన్నాయని, వీటిని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికా బద్దంగా అభివృద్ది పర్చడంతో పాటు భక్తుల సౌకర్యార్థం పలు వసతుల కల్పించేందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్లను రూపొందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రూపొందించే కార్యక్రమానికి సంబందించిన పైలెట్ ప్రాజక్టు అమలుకు విజయవాడలోని శ్రీ దుర్గామల్లీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఎంచుకోవడం జరిగిందని, ఒకటిరెండు రోజుల్లో సంబంధిత ఏజన్సీలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని 1,668 దేవాలయాలల్లో ధూపదీఫనైవేద్యం పథకం అమలు చేయడం జరుగుచున్నదని, ఈ పథకం క్రింద ప్రతి దేవాలయానికి నెలకు రూ.5 వేలు ఆర్థిక సహాయాన్ని దేవాదాయ శాఖ అందజేయడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. అయితే ఈ పథకాన్ని మరికొన్ని దేవాలయాల్లో అమలు చేయాలని ఇప్పటి వరకూ 653 ధరఖాస్తులు అందాయని, వాటిలో 73 ప్రతిపాదలను వెంటనే ఆమోదించడం జరిగిందని, అర్హతను బట్టి మిగిలిన ధరఖాస్తులను కూడా త్వరలో పరిష్కారించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
6ఎ, 6బి కేటగిరీ దేవాలయాల నుండి 9 శాతం కామన్ గుడ్ ఫండ్ (సి.జి.ఎఫ్.) గా దాదాపు రూ. 80 నుండి 90 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ బకాయిలను సత్వరమే వసూలు చేసేందుకు, సి.జి.ఎఫ్. నిధులతో ఇప్పటికే చేపట్టిన 184 పనులు పురోగతిలో ఉన్నాయని, వాటన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనులను అన్నింటినీ సకాలంలో పూర్తిచేసేందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పై తీసుకునేందుకు ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. సి.జి.ఎఫ్. క్రింద మరో 99 పనులు చేపట్టేందుకు పలు ప్రజాప్రతినిధులు, దేవాలయాలు, గ్రామాల నుండి ప్రతిపాదనలు అందాయని, వాటి విలువ దాదాపు రూ.58.80 కోట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. వాటన్నింటినీ కూడా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.