Breaking News

ప్రగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.ప్రగతి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్,కాకినాడ-శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్.డా.సమీర్ శర్మతో సమీక్షించారు.అలాగే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి సిఎస్ లతో ప్రధాని సమీక్షించారు.రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ కు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సిఎస్ డా.సమీర్ శర్మను ఆదేశించారు. ఈఎకనమిక్ కారిడార్ ఏర్పాటుతో చత్తీస్ ఘడ్,ఒడిస్సా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.ముఖ్యంగా అల్యూమినియం,బొగ్గు,బాక్సైట్ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి దిగుమతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని మోడి పేర్కొన్నారు.అదే విధంగా కాకినాడ-శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అనంతరం నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 5జీ సేవలకు ఇది ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు.ఫైబర్,టవర్ ఇన్స్టాలేషన్లకు సంబంధించిన అనుమతులు వేగవంతం చేయడంతో పాటు ఆసేవలను కేంద్రీకరిస్తుందని పేర్కొన్నారు.అంతేగాక గతిశక్తి సంచార్ పోర్టల్ కేంద్రీకృత రైట్ ఆఫ్ వే(ఆర్ఓడబ్ల్యూ) అనుమతుల్ని సులభతరం చేస్తుందని ప్రధాని చెప్పారు.టెలికాం పరిశ్రమ మౌలిక వసతుల కల్పన కోసం,ఆర్ఓడబ్ల్యూ అనుమతులు పొందేందుకు,5జీ సేవల కోసం ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.ఈపోర్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు,కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను అనుసంధానించేలా ఏకీకృత, సమీకృత,కేంద్రీకృత విధానాన్నిఅందిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లకు వివరిస్తూ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ కు సంబంధించి 798 హెక్టార్లు భూసేకరణకు గాను 561 హెక్టార్ల భూమిని ఇప్పటికే అప్పగించడం జరిగిందని ప్రధానికి వివరించారు.అలాగే రోడ్డుసైడ్ ఎమ్నిటీస్ కు సంబంధించి మరో 50 ఎకరాలను కూడా అప్పగించినట్టు చెప్పారు. మిగిలిన భూసేకరణకు గాను అడ్వాన్సు పొజిషన్ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు వివరించారు.అదే విధంగా కాకినాడ-శ్రీకాకుళం సహజవాయువు పైపు లైను ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వరకూ గల మొదటి దశ పూర్తయిందని తెలిపారు.విశాఖపట్నం నుండి కాకినాడ వరకూ రెండవ దశ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి వివరించారు.
ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది,జయలక్ష్మి,అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డా.చలపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *