అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) పొందడంలో కలుగుతున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గితేష్ శర్మ, IFS (రిటైర్డ్) ప్రత్యేక ప్రతినిధి (ఇంటర్నేషనల్ కోఆపరేషన్), మరియు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ & చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఆర్మ్ స్ట్రాంగ్ చాంగ్సన్ మరియు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శ్రీనివాస్ రావు దృష్టికి తీసుకెళ్ళడంతో PCC ప్రక్రియ పై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున తీసుకొంటున్న చర్యల గురించి ఆర్మ్ స్ట్రాంగ్, గితేష్ శర్మ కి లేఖ పంపారు.
లేఖలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి…
1. విశాఖపట్నం, విజయవాడ మొదలైన పాస్పోర్ట్ ఆఫీస్ లతో సహా భారతదేశం అంతటా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అపాయింట్మెంట్ స్లాట్లను పెంచుతున్నాము.
2. ప్రత్యేకించి విజయవాడలో పాస్పోర్ట్ ఆఫీస్ నందు వారంలో ఒక రోజుని పూర్తిగా PCC అపాయింట్మెంట్ల కోసం కేటాయిస్తున్నాము. (పిసిసి ప్రక్రియ వ్యవధి తగ్గించేందుకు).
3. గత సంవత్సరంలో స్పష్టమైన పోలీసు నివేదిక ఉన్న వారికి త్వరితగతిన PCC ని జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము.
ఆంధ్రప్రదేశ్ లో PCC ప్రక్రియ త్వరలో సాధారణ స్థితికి రావటానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎవరూ నకిలీ PCC మరియు విజిట్ వీసాల మీద వెళ్లి తర్వాత దానిని వర్క్ వీసాగా మార్చుకోవచ్చు అన్న ఉద్దేశ్యంతో విదేశాలకు వెళ్లి, ఇబ్బందులు పడవద్దని APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి విజ్ఞప్తి చేసారు.