-ముస్లింల సంక్షేమానికి బిజెపి కట్టుబడి ఉంది
-బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖి
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
భూ కబ్జాదారులు చేతిలో చిక్కుకున్న వక్ఫ్ భూముల సమస్యల గురించి చెప్పుకునేందుకు కనీసం వక్ఫ్ ట్రిబ్యునల్ లేకపోవడం రాష్ట్రంలో పాలకులు ముస్లింల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం అని అన్నారు బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాల్ సిద్ధిఖీ. బుధవారం నాడు రాష్ట్ర పర్యటనలో భాగంగా కొండపల్లి లోని సుప్రసిద్ధ ఆయన పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గాను సందర్శించారు. షాఋఖారి ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ఆయనను సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జమాల్ సిద్ధికి మాట్లాడుతూ నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమానికి బిజెపి పాలన సాగిస్తుందని తెలిపారు. ప్రఖ్యాతి గాంచిన పురాతన దర్గా కు భక్తులు వచ్చేందుకు సరైన మార్గం లేకపోవడం విచారకరమని, కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించకపోవడం పాలకుల నిర్లక్ష్యంమేనని దుయ్యబట్టారు. అల్తాఫ్ బాబా తనకు బ్రిడ్జి గురించి తెలిపినప్పుడు కన్నా స్వయంగా చూసినప్పుడు భక్తులు ఎదుర్కొంటున్న సమస్య అర్థమైందని తప్పకుండా సమస్యను జాతీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, మైనార్టీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తో చర్చించి కాంక్రీట్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. మరోసారి జాతీయ నాయకులతో దర్గాను సందర్శించి కాంక్రీట్ బ్రిడ్జిపై నివేదిక తయారు చేస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డు సమస్యలు చాలా ఉన్నాయి అని, సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రంలో కనీసం వక్ఫ్ ట్రిబ్యునల్ లేకపోవటం ప్రభుత్వం ముస్లింల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రతీక అని అన్నారు. జాతీయ మైనారిటీ మోర్చా కార్యదర్శి లాయక్ అలీ మాట్లాడుతూ షాఋఖారి దర్గా ను సందర్శించడం తమ అదృష్టమని, ఇక్కడ జరుగుతున్న అన్నదానం ఒక గోప్ప కార్యక్రమం అని ప్రశంసించారు. బిజెపి మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ నూతలపాటి బాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనుక ఏదో అపురూప శక్తి ఉందని, ఇక్కడికి వస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా నాయకులు నాగుల్ మీరా, సయ్యద్ భాష, షేక్ సుభాని, స్థానిక బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.