-10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజక వర్గంలో పండగలా చేయాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా పత్రాలు, సభ్యత్వ కిట్లను అందచేసే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం పొందారు. వీరికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఈ బీమా కోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నిధిని సమకూర్చారు. మూడు రోజులపాటు చేపట్టే బీమా పత్రాలు, కిట్లు పంపిణీ కార్యక్రమ నిర్వహణపై రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ‘బీమా పత్రం, పార్టీ అధ్యక్షుల వారి మనోగతాన్ని తెలిపే ప్రతులు, ఐడీ కార్డు, పార్టీ స్టికర్స్, పార్టీ క్యాలెండర్ లాంటి వాటితో కూడిన కిట్ ను ప్రతి క్రియాశీలక సభ్యుడికీ అందచేయాలి. పార్టీ క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో క్రియాశీలక సభ్యులు కీలకంగా వ్యవహరించేలా నిర్దేశించాలి” అన్నారు.
ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాలకు సమన్వయకర్తలను నియమించారు. కర్నూలు జిల్లాకు బొలిశెట్టి సత్య, నయూబ్ కమాల్, ఆకేపాటి సుభాషిణి, కడప జిల్లాకు పి.విజయ్ కుమార్, వడ్రానం మార్కండేయబాబు, పొలసపల్లి సరోజ, శ్రీకాకుళం జిల్లాకు బోనబోయిన శ్రీనివాస యాదవ్, ఎ.దుర్గా ప్రశాంతి, తాడి మోహన్, విజయనగరం జిల్లాకు పాలవలస యశస్వి, గడసాల అప్పారావు, బేతపూడి విజయశేఖర్, విశాఖపట్నం జిల్లాకు చేగొండి సూర్యప్రకాశ్, అమ్మిశెట్టి వాసు, ఘంటసాల వెంకటలక్ష్మిలను సమన్వయకర్తలుగా నియమించారు.