-రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత నెల 11 వ తేదీ నుండి నిర్వహిస్తున్న “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో శాసన సభ్యుల వ్యక్తిగత సహాయకులు (PA) మమేకం కావాలని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం అమరావతి శాసన సభ ప్రాంగణంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంపై “ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకుల (PA) అవగాహనా కార్యక్రమం” జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ముంగిటకే నేరుగా ప్రభుత్వం వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వెనువెంటనే పరిష్కరించే మహోన్నత కార్యక్రమం “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం అన్నారు. శాసన సభ్యులు తమ నియోజక వర్గ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో గల ప్రతి ఇంటిని సందర్శించేందుకు కనీసం మూడు రోజుల పాటు ప్రతి సచివాలయ పరిధిలో పర్యటిస్తారన్నారు. ఈ విధంగా శాసన సభ్యులు నెలలో కనీసం 20 రోజుల పాటు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్కొంటారన్నారు. ఐతే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులు (PA) కీలక పాత్రపోషించాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబందించి శాసన సభ్యుల పర్యటన షెడ్యూలును, వాటిలోని మార్పులు, చేర్పులను ముందస్తుగా ఖరారు అయ్యేలా చూడాలని, సదరు షెడ్యూలును సంబందిత అధికారులకు అందరికీ పంపే బాధ్యత ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకుల (PA) పై ఉందన్నారు. పర్యటన సమయంలో ప్రభుత్వం పథకాలు, ప్రభుత్వేతర పథకాలకు సంబందించి ప్రజల నుండి వచ్చే విజ్ఞాపనల్లోని అత్యంత ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటిని ఎమ్యెల్యేలు, అధికారుల దృష్టికి వచ్చేలా చూడాలన్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులు ఎప్పటి కప్పుడు అందజేసే తాజా సమాచారాన్ని క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తదనుగుణంగా ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం సందర్బంగా ఎమ్మెల్యేలు నిర్వహించే పర్యటనల్లో స్థానిక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకుల (PA) పై ఉందన్నారు. ఇందుకు తగ్గట్టుగా వారికి ముందుగానే ఎమ్మెల్యేల పర్యటన షెడ్యూలును పంపి వారంతా ఈ కార్యక్రమంలో మమేకం అయ్యేలా చూడాలన్నారు.
రాష్ట్ర గ్రామ, వార్డు వాలంటీర్లు మరియు గ్రామ, వార్డు సెక్రటేరియట్స్ శాఖ కమిషనర్ షన్ మోహన్ శాసన సభ్యుల సహాయకులు (PA) నిర్వహించాల్సిన కీలక విధులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ అవగాహనా కార్యక్రమంలో శాస సభ్యుల వ్యక్తిగత సహాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని, ఇంత వరకు జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో వారు గుర్తించిన పలు అంశాలను, సమస్యలను సదస్సుల్లో వివరించారు.
ముఖ్యమంత్రి సలహాదారుడు (గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.ధనంజయ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద రాజు, శాసన మండలి సభ్యులు ఎల్.అప్పిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.