-రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు కొత్త రూపు
-ఏపీవీవీపీ ఆస్పత్రుల స్వరూపం మారిపోతోంది
-ఒక్కో ఆస్పత్రికి సగటున వంద మంది సిబ్బంది
-జగనన్న అడగకుండానే అన్నీ ఇస్తున్నారు
-ఏపీవీవీపీలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం
-పూర్తి ప్రక్షాళన దిశగా సెకండరీ వైద్య విధానం
-1220 కోట్లతో ఏపీవీవీపీ ఆస్పత్రుల అభివృద్ధి
-ఏకరీతిగా ఇక ఆస్పత్రులు
-ఒకేలా సిబ్బంది, వసతులు
-గత ప్రభుత్వ హయాంలో కునారిల్లిపోయిన ప్రభుత్వ వైద్యం
-జగనన్న ప్రభుత్వంలో జవసత్వాలు నింపుకుంటున్న ప్రభుత్వ ఆస్పత్రులు
-పేదల ఆరోగ్యానికి ఇక పూర్తి భద్రత
-ఏపీవీవీపీ విభాగంపై సమీక్షలో స్పష్టం చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
-రాష్ట్ర సచివాలయంలో పూర్తి స్థాయి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కావాల్సినంతమంది సిబ్బందిని నియమించుకోవడం, ఖాళీలన్నీ భర్తీ చేయడం, 16వేల కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక భవనాల నిర్మాణం, వసతులు సమకూర్చడం, ఏటా రెండువేల కోట్ల రూపాయలకుపైగా నిధులతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం… లాంటి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొత్తరూపు తీసుకొస్తున్నారని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. స్థానిక రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఏపీవీవీపీ (ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్) పై పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏపీవీవీపీ కింద 173 సీహెచ్‌సీలు, 53 ఏరియా వైద్య శాలలు, 17 జిల్లా ఆస్పత్రులు, 2 ఎంసీహెచ్‌లు నడుస్తున్నాయని చెప్పారు. మరో చెస్ట్ డిసీజ్ ఆస్పత్రి కూడా నడుస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 251 ఆస్పత్రులు ఏపీవీవీపీ కింద ఉన్నాయని, మొత్తంమీద 16,340 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రులు నడుస్తున్నాయని తెలిపారు.
ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా
మంత్రి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేవరకు ఈ ఆస్పత్రిల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంలో ఉండేదని తెలిపారు. దశాబ్దాలు అవే వసతులు, అదే సిబ్బందితో ఈ ఆస్పత్రులు నడుస్తూ ఉండేవని చెప్పారు. ఎవరూ పట్టించుకున్నపాపాన పోలేదని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైద్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. గతంలో వైద్య సిబ్బంది ఒక లెక్క అనేది లేకుండా ఉండేవారని, ఇప్పుడు ఏపీవీవీపీ కి సంబంధించిన అన్ని ఆస్పత్రుల్లో నూ సిబ్బంది ఏకరీతిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 మంది డాక్టర్లు సహా మొత్తం 31 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. 50 పడకల ఆస్పత్రిలో 11 మంది డాక్టర్లు సహా మొత్తం 43 మంది, 100 పడకల సీహెచ్‌సీ, 150 పడకల ఏరియా ఆస్పత్రుల్లో 23 మంది డాక్టర్లు సహా మొత్తం 95 మంది సిబ్బంది, 150 పడకల జిల్లా వైద్య శాలలో 128 మంది, 200 పడకల వైద్య శాలలో 154 మంది, 300 పడకల వైద్యశాలలో 180 మంది, 400 పడకల జిల్లా ఆస్పత్రుల్లో 227 మంది సిబ్బంది పనిచేస్తారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని వైద్యశాలల్లోనూ ఇలానే ఏకరీతిగా సిబ్బంది ఉంటారని, మరో 2, 3 నెలల్లో నే సిబ్బంది మొత్తం ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. దీనివల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వివరించారు.
రూ.1220 కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి
రాష్ట్రంలోని ఏపీవీవీపీ ఆస్పత్రులను నాడు- నేడు కార్యక్రమం కింద ఏకంగా రూ.1220 కోట్ల తో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా పూర్తి వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే, ఒక్క ఏపీవీవీపీ విభాగంలోనే 4,464 పోస్టులను భర్తీ చేసిన ముఖ్యమంత్రి కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు.
సిబ్బంది పనిచేస్తేనే ప్రభుత్వ ఆశయాలు నెరవేరతాయి
ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో కోట్లు వైద్య ఆరోగ్యశాఖ కోసం ఖర్చు చేస్తున్నారని, వైద్య విధానాన్ని పూర్తిగా సంస్కరిస్తున్నారని మంత్రి విడదల రజిని తెలిపారు. సీఎం ఆలోచనలు ఆచరణలోకి రావాలన్నా, ప్రభుత్వ ఆశయాలు నెరవేరాలన్నా… సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి ఒక విలువ దక్కాలంటే వైద్య సిబ్బంది నిజాయితీగా కష్టపడి పనిచేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అప్పుడే తగిన న్యాయం దక్కుతుందని చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, డైట్, సెక్యూరిటీ ఏజెన్సీలన్నీ నిబంధనలు అనుగుణంగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎక్కడైనా సరే నిబంధనలకు అనుగుణంగా ఏ ఎజెన్సీ పనిచేయకపోయినా బిల్లులు ఆపేయాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారికి ఎవరూ అండగా నిలవొద్దని చెప్పారు. అన్ని ఆస్సత్రులను తాను స్వయంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా సమస్యలు తన దృష్టికి వస్తే వెనువెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలసత్వానికి తావీయొద్దు
అన్ని జిల్లాల డీసీహెచ్ ఎస్ లు, ఇతర ఉన్నతాధికారులు ఎవరూ కూడా అలసత్వానికి తావీయొద్దని మంత్రి విడదల రజిని సూచించారు. జిల్లాల, రాష్ట్ర ఉన్నతాధికారులంతా క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలని చెప్పారు. అన్ని ఆస్పత్రులపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలన్నీ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని చెప్పారు. అవినీతికి తావులేకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారని, అందుకు అనుగుణంగా అంతా పనిచేయాలని చెప్పారు. కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు అనుకూలంగా పనిచేస్తూ ప్రజధనం దుర్వినియోగం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టంచేశారు. జాతీయ రహదారులు వెంబడి ఉండే ఆస్పత్రులు, ప్రమాదాలు ఎక్కువగా నమోదువున్న ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు, లేదా రక్తం అందుబాటులో ఉండేలా ఏదైనా నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే లా కృషి చేస్తామన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట లోని ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు అంచనాలు రూపొందించాలని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీవీవీపీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకురాగలిగామని, అందుకు అధికారులు బాగా కృషి చేశారని తెలిపారు. న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్టీ ఆర్ జిల్లాలో అందుతున్న వైద్య సేవలు సంతృప్తికరంగా లేవని, పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. కంటి వెలుగు విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పారు. జగనన్న కంటి వెలుగు ద్వారా చేపడుతున్న సర్జరీలు ప్రభుత్వ ఆర్థిక సాయంతో జరుగుతున్నాయనే విషయాన్ని లబ్ధిదారులకు తెలిసేలా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, జాయింట్ కమిషనర్, ఆయా జిల్లాల డీసీహెచ్ ఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.