-ఉప ముఖ్యమంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాధం మోపాలని ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ సి.ఎస్. రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, ఎ.పి.ఎస్.బి.సి.ఎల్. ఎం.డి. వాసుదేవ రెడ్డి తదితరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వీడియో కాన్పరెన్సు ద్వారా పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ సారాను అరికట్టండంలో అధికారులు అంతా ఎంతో ప్రణాళికాబద్దంగా కృషిచేస్తున్నారని అభినందించారు. అయితే రాష్ట్రంలో చెదురు మదురుగా జరుగుచున్న నాటుసారా తయారీని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నాటు సారా తయారీదారులపై పి.డి.యాక్టు ప్రకారం కేసులు పెట్టాలని, వారికి కౌన్సిల్లింగ్ నిర్వహించి ప్రత్యామ్నయ జీవనోపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ సారా, లిక్కర్ రవాణాలో స్వాదీనం చేసుకున్న వాహనాలను వేలం వేయాల్సినదిగా అధికారులకు ఆయన సూచించారు. నూతన బార్ పాలసీ నియమ, నిబంధలను త్వరితగతిన రూపొదించాలన్నారు. స్టేట్ ఎక్సైజ్ బోర్డు పనితీరును సమీక్షిస్తూ ఎస్.ఇ.బి. స్టేషన్ల నిర్వహణ ఖర్చులను చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
స్టేట్ ఎక్సైజ్ బోర్డు సంచాలకులు రమేష్ రెడ్డి, కమిషనర్ రవి శంకర్ అయ్యాన్నర్, ఆబ్కారీ శాఖ అదనపు కమిషనర్ దేవ కుమార్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.