మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భూములు ఇచ్చిన వారిలో పట్టా భూముల రైతులకు అమరావతిలో ప్లాట్లు ఇచ్చారని రిజిస్ట్రేషన్ కూడా చేశారని, అమరావతిలో ప్లాట్లు ఇంకా పొందని వారి సమస్య పరిష్కరించాలని, నష్ట పరిహారం అందని వారి సమస్య, మరి కొంత మంది రైతులకు వార్షిక కౌలు సైతం అందడం లేదని వీరికి కూడా అందెలా చూడాలని గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ లో గన్నవరం నియోజకవర్గ సమస్యలపై రెవెన్యూ, ఆర్ డబ్ల్యూఎస్, ఎపిఐఐసి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసన సభ్యులు గన్నవరం నియోజక వర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరును కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన కలెక్టర్ గన్నవరం నియోజకవర్గ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ రంజిత్‌భాష అధికారులను ఆదేశించారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలెక్టర్‌కు వివరించగా సిఆర్‌డిఎ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గన్నవరం మండలంలో 22ఎ నిషేధిత జాబితాలో భూములు గల వారికి అమరావతిలో ప్లాట్లు ఇచ్చినా రిజిస్ట్రేషన్ కావడం లేదని సమస్య పరిష్కరించాలని కలెక్టరును కోరగా ఎక్సైంజ్ ఆఫ్ ల్యాండ్ (భూమార్పిడి)కు అనుమతి రావాల్సి ఉందని అధికారులు వివరించారు. ఎయిర్‌పోర్టు వద్ద వంతెన నిర్మించాల్సి ఉందని, అలాగే బ్రహ్మయ్యలింగయ్య చెరువు లిఫ్టు డిజైన్ ఆమోదం పెండింగ్‌లో ఉందని, సమస్య పరిష్కరించాలని కోరారు. రామవరపాడు- బొమ్ములూరు మధ్య జాతీయ రహదారి ఇరువైపుల డ్రైనేజి సమస్య ఉందని, బైపాస్ కూడా వేస్తున్నారని, దానికి కూడా డ్రైనేజిలు, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. గన్నవరం నియోజక వర్గ పరిధిలో 4 మండలాల్లో కాలువ గట్ల మీద ఇళ్లు వేసుకుని నివశిస్తున్న వారికి ఇళ్ల స్థలాలు మంజూరు కావడం లేదని, తెంపల్లి త్రాగునీటి ప్రభావిత ప్రాంతంలో పైపు లైన్ పనులు పూర్తి చేయాలని, కేసరపల్లి లేఅవుట్‌లో లబ్దిదారులు వెంటనే ఇళ్లు నిర్మించుకోవటానికి వంతెన నిర్మించాలని అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలిపారు. బాపులపాడు పట్టణంలో 20 ఎకరాల్లో లేఅవుట్ వేసినప్పటికి దారి లేదని, దారి కోసం భూసేకరణ ప్రతిపాదనలు ఆమోదించి అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. అజ్జంపూడి లేఅవుట్ చెరువులో వేశారని, అప్రోచ్ రోడ్డు లేదని సమస్య పరిష్కరించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గంలో పలు లేఅవుట్లలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూములు ఇచ్చిన రైతుల్లో కొంత మందికి నష్ట పరిహారం అందలేదని ఎమ్మెల్యే తెలుపగా సమస్య పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైతుల నుండి అర్జీలు స్వీకరించామని, వచ్చిన అర్జీలు పరిష్కరించి పారదర్శకంగా ఉన్న కేసులు గుర్తించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. రైతులు ఎవరైనా నష్టపరిహారం పొందకపోతే వారు తమ వద్ద గల పక్కా ఆధారాలతో ఆర్డీవోను కలిసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ గుడివాడ ఆర్డీవోను ఆదేశించారు.
ఈ సమావేశంలో గుడివాడ ఆర్ డివో పద్మావతి, గన్నవరం బాపులపాడు, ఉంగుటూరు మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …