-ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమని ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలిపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.
శనివారం ఉదయం ఆయన స్థానిక డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సర్కిల్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నవంబర్ 26న మనదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారని, 1949 నవంబర్ 26న భారతదేశం మహోన్నతమైన రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందని, ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూల్స్ లోని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, పురోగతి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితమై కృషి చేయాలన్నారు.
రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి భవిష్యత్ తరాలకు రాజ్యాంగం ద్వారా దశ దిశ నిర్దేశించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు,బాధ్యతలు కూడా చాలా ముఖ్యమని అందరం రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందంటే భారత రాజ్యాంగంలోని అంశాలే ప్రధాన కారణమని, అలాంటి రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చే పథకాలు, చట్టాలు ఏవైనా భారత రాజ్యాంగానికి లోబడి ఉంటాయని, దేశ వ్యవస్థలో సామాన్యుడికి ఏ సమస్య వచ్చినా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. మనందరం కూడా రాజ్యాంగ పరిధిలోనే బాధ్యతలు నిర్వహించి దేశ సమగ్రతకు, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాజ్యాంగ ఆమోదం లేనిదే ఏ పనులు ప్రారంభించలేమని ప్రతి పనికి రాజ్యాంగముద్ర అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్చగా జీవిస్తూ తమ భావాలు, ఆలోచనలను వ్యక్త పరచే అవకాశం కల్పించిదన్నారు. మనం ప్రజలకు సేవకులం కాబట్టి వాళ్లకు తగ్గట్టుగా సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మాజీ అర్బన్ బ్యాంకు ఛైర్మెన్ బొర్రా విఠల్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కుల ఆనంద్ బాబు ( జానీ ), కో – ఆప్షన్ మెంబర్ బేతపూడి రవి, మాజీ కౌన్సిలర్ గాడెల్లి డేవిడ్, అంబెడ్కర్ బాబు పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.