Breaking News

నిర్మాణ పనులు మొదలైన 30 మాసాల్లొ బందరు పోర్టు సిద్ధం… : మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని

-జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ముఖ్యమంత్రి స్వహస్తాల మీదుగా పనుల నిర్మాణానికి శంకుస్థాపన
-విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిని 6 లైన్ల రహదారిగా ఆధునీకరణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు పోర్టు నిర్మాణం మొదలైన 30 మాసాల్లొ శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెగా ఇంజినీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకోనుందని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.
బుధవారం ఉదయం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో బందరు పోర్టుకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా వాసుల చిరకాల వాంఛ బందరు పోర్టు అని.. 18 ఏళ్ళ నుంచి తమ కల సాకారం కాకపోవటం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం వల్లే పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని ఆయన వివరించారు. వైఎస్సార్ కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లావాసుల చిరకాల స్వప్నం సాకారమవుతుందన్నారు.న్యాయపరమైన చిక్కుల వల్ల ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వివరించారు. రెండు, మూడు వారాల్లో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వస్తాయనే ధీమా ఎమ్మెల్యే పేర్ని నాని వ్యక్తం చేశారు.
బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు, ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేస్తోందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఆమోదించిందని చెప్పారు. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి వైపు 2 కిలోమీటర్ల 325 మీటర్ల దక్షిణం, ఉత్తరం బ్రేక్స్ వాటర్ గోడల నిర్మాణాలకు రూ.446 కోట్లు అవసరం అవుతాయన్నారు. ఉత్తరం వైపున 250 మీటర్ల కొండరాళ్లతో కాంక్రీట్ గోడ నిర్మాణానికి రూ. 10. 94 కోట్లు, అలాగే దక్షిణం వైపున సడన్ బ్రేక్ వాటర్ రూ. 435 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. 4. 6 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సివస్తుందన్నారు. డ్రెడ్జింగ్ కోసం మరో రూ.1242.88 కోట్లు, సముద్రం నుంచి ఓడలు రావడానికి అప్రోచ్ ఛానెల్ నిర్మాణానికి రూ. 706.26 కోట్లు, బ్రేక్ వాటర్ మధ్యలో ఓడలు తిరగడానికి టర్నింగ్ సర్కిల్, బెర్త్ పాకెట్స్ కోసం రూ.452.07 కోట్లు కావాలన్నారు.
బందరు పోర్టులో మొదటి విడతగా 4 బెర్తుల నిర్మాణం జరుగుతుందని.. మూడు బెర్తుల కోసం రూ.548 కోట్లు, బల్క్ కార్గో కోసం ఒక బెర్త్ .. దీనికి రూ.158 కోట్లు వ్యయం అవుతుందని ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే 80 వేల టన్నుల బరువుతో వచ్చే షిప్పులు సైతం సురక్షితంగా రాగలుగుతాయన్నారు. లక్ష నుంచి లక్షన్నర బరువుతో ఉండే షిప్పులు వచ్చే బెర్తులను సెకెండ్ ఫేజ్’ లో నిర్మిస్తామన్నారు.
అదేవిధంగా బందరు పోర్టు నిర్మాణానికి 1730 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.మొదటి దశలో ఒక్క ఎకరం ప్రైవేట్ భూమి కూడా తీసుకోవడం లేదన్నారు.రైల్, రోడ్డు నిర్మాణానికి 235 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)లను నిర్మించాల్సి ఉంటుందని పేర్ని నాని చెప్పారు.ఇప్పటికే భూమి ఉన్న విజయవాడ రోడ్డు నుంచి మచిలీపట్నం వచ్చే ప్రధాన రహదారిని 6 లైన్ల రహదారిగా ఆధునీకరించనున్నట్లు అందుకు తగినట్లుగా త్వరలోనే డీ పి ఆర్ చేయమని ఆదేశాలు సైతం వెలువడినట్లు చెప్పారు, మచిలీపట్నం పోర్టును 30 మాసాల్లో శరవేగంగా పూర్తి చేసే విధంగా మెగా ఇంజినీరింగ్ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. 2023 జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరి నెలలో సీఎం జగన్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తెలిపారు
ఈ సమావేశంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ , డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత థామస్ నోబుల్, ముడా ఛైర్మెన్ బొర్రా నాగ దుర్గా భవాని విఠల్, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మాజీ జడ్పిటిసి సభ్యులు లంకె వెంకటేశ్వరరావు (ఎల్వి యార్), మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా (అచ్చాబా) పలువురు కార్పొరేటర్లు, కో- ఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *