-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ గృహాలు అందించే కార్యక్రమంలో నిర్మించిన టిడ్కో గృహాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి, లబ్ధిదారులకు ఆ ఇళ్లు త్వరితగతిన కేటాయించాలని అధికారులను కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన పలువురు బ్యాంకు మేనేజర్లతో, కో- ఆర్డినేటర్లతో టిడ్కో గృహాల కేటాయింపు ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో గుడివాడలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందించే మహత్తర కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో రుణాల మంజూరు వేగవంతం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల గృహాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు, 300 చదరపు అడుగుల గృహాలకు నేరుగా 1 రూపాయి చొప్పున రిజిస్ట్రేషన్ తో ఇల్లు మంజూరుకాబడుతుందని చెప్పారు. గుడివాడలో 365, 430 ఎస్ ఎఫ్టి గృహాలు 7, 328 ఎస్ ఎల్ బి సి లక్ష్యం గూర్చి వాకబు చేస్తూ, ఇప్పటివరకు గుడివాడలో16 బ్యాంకుల నుంచి మొత్తం 4, 828 రుణాలు లబ్ధిదారులకు అందినట్లు తెలిపారు. వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడం కూడా అభినందనీయమని కలెక్టర్ సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఈ నెల 10 వ తేదీ లోపు మిగిలిన గృహ రుణాలను బ్యాంకర్లతో మాట్లాడి వేగవంతంగా మంజూరు చేయించాలని బ్యాంకర్లకు ఆదేశించారు. బ్యాంకులలో రుణాలు తిరస్కరింపునకు గురైన వారి వివరాలు సేకరించి తిరిగి రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. టిడ్కో గృహాలు మంజూరైనప్పటికీ స్వీకరించేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడి గృహాలు కేటాయించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో మెప్మా పి డి విశాలాక్షి , జిల్లా రిజిస్టర్ ఉపేంద్రరావు , లీడ్ బ్యాంకు మేనేజర్ సాయిరాం తదితర అధికారులు పాల్గొన్నారు.