Breaking News

గడప గడపకు మన ప్రభుత్వంతో సంక్షేమ పథకాల్లో జవాబుదారితనం

-మంత్రి జోగి రమేష్

కృత్తివెన్ను/బంటుమిల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ సంక్షేమ పథకాల పట్ల జవాబుదారీతనంగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
శుక్రవారం ఆయన కృత్తివెన్ను మండలంలోని ఒంటిల్లు, శీతనపల్లి బంటుమిల్లి మండలంలోని ఆముదాలపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామస్థులకు వివరిస్తూ కరపత్రాలను అందించారు. ఇంటింటిని సందర్శిస్తూ ప్రతి ఒక్కరినీ మంత్రి ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుకు జవాబుదారీ వహిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. దీని ద్వారా అర్హులైన ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి ఇదొక గొప్ప అవకాశమని, అధికారుల సమక్షంలో అట్టి వారికి లబ్ధిని చేకూర్చడం జరుగుతుందన్నారు. ఇది సంక్షేమాభివృద్ది రథ సారథి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనత అని మంత్రి కొనియాడారు.
మంత్రి ఇంటింటిని సందర్శిస్తూ పథకాల లబ్ధిని వివరించడంతో పాటు గ్రామస్తుల సమస్యలను సావధానంగా ఆలకిస్తూ అక్కడిక్కడే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేశారు. గ్రామంలో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంతో పాటు జగనన్న స్వఛ్చ సంకల్పం ద్వారా రోడ్ల పక్కనున్న చెత్త తరలింపునకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శీతనపల్లి గ్రామానికి చెందిన వికలాంగురాలైన గంటా జ్యోతికి మూడు చక్రాల సైకిల్ ను తక్షణమే అందించాలని అధికారులకు సూచించారు. శీతనపల్లిల్లో గ్రామస్తుల అభ్యర్థన మేరకు చర్చ్ నిర్మాణానికి తన వంతు సాయంగా రూ.లక్ష అందిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే గ్రామంలో త్వరలో పాఠశాల నిర్మాణం చేపడతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
గ్రామంలోని అంగనవాడీ, ఎలిమెంటరీ పాఠశాల చిన్నారులతో ముచ్చటించి మధ్యాహ్నం భోజనంపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన రుచి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను, బంటుమిల్లి జెడ్పీటీసీ లు మైలా రత్న కుమారి, మలిసెట్టీ వెంకట రమణ, కృత్తివెన్ను, బంటుమిల్లి ఎంపిడిఓ లు పిచ్చిబాబు, స్వర్ణ భారతి, తాసిల్డార్లు రామకోటేశ్వరరావు, సత్యనారాయణ, సర్పంచ్ లు కూనసాని సునీత, దాసరి సీయోన్ కుమారి, ఎంపిపి లు గరుడ ప్రసాద్, వెలివెల చినబాబు, పెడన మున్సిపాలిటీ కౌన్సిలర్ బళ్ల గంగయ్య, వైసీపీ మండల కన్వీనర్ ఎం రాజబాబు, వైసీపీ మండల మహిళా కన్వీనర్ ఝాన్సీ, వివిధ శాఖల అధికారులు, వైయస్సార్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *