Breaking News

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు స‌మ‌ష్టి కృషి

– ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ కొమ్మినేని శ్రీనివాస‌రావు
– జీవ‌వైవిధ్యానికి నెల‌వైన కోరంగి మ‌డ అడవుల‌కు మ‌రింత గుర్తింపు తేవాలని పిలుపు

కాకినాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ కొమ్మినేని శ్రీనివాస‌రావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం కొమ్మినేని శ్రీనివాస‌రావు కోరంగి వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రాన్ని సంద‌ర్శించారు. చెక్క వంతెనపై న‌డుస్తూ మడ అడ‌వుల‌ను ప‌రిశీలించారు. టూరిస్ట్ స్పాట్ ఫెర్రీ పాయింట్ నుంచి బోటులో ప్ర‌యాణించి, ప్ర‌కృతి ప్ర‌సాదించిన అట‌వీ సంప‌ద‌ను తిల‌కించారు. మ‌డ అడవుల్లోని వృక్ష‌, జంతు సంప‌ద, జీవ వైవిధ్యం గురించి జిల్లా అట‌వీశాఖ‌ అధికారి ఇందుకూరి కాశీవిశ్వ‌నాథ‌రాజు.. ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌కు వివ‌రించారు. అనంత‌రం కోరింగ ఫారెస్ట్ కాంప్లెక్స్ స‌మావేశ మందిరానికి చేరుకొని కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి 235 చ‌.కి.మీ. విస్తీర్ణంలో, 56,200 ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న కోరంగి మ‌డ అడ‌వుల‌పై ఏర్పాటుచేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించారు. అనంత‌రం అక్క‌డి స‌మావేశ మందిరంలో ప్రెస్ అకాడ‌మీ, జిల్లా అట‌వీశాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన మ‌డ అడ‌వుల సంర‌క్ష‌ణ‌-సామాజిక బాధ్య‌త‌-మీడియా పాత్ర‌, జ‌ర్న‌లిజం మౌలిక సూత్రాలు-విలువ‌లు-అంశాల‌పై చ‌ర్చా కార్య‌క్ర‌మానికి కొమ్మినేని శ్రీనివాస‌రావు.. ప్రెస్ అకాడ‌మీ కార్య‌ద‌ర్శి ఎం.బాల‌గంగాధ‌ర్ తిల‌క్‌, ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ వెంక‌ట స‌తీష్ కుమార్‌, కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు, యానాం ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి శ్రీనివాస అశోక్‌, డీఎఫ్‌వో ఐకేవీ రాజు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త పేరిచ‌ర్ల రాజ‌గోపాల‌రాజు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కొమ్మినేని శ్రీనివాస‌రావు మాట్లాడుతూ కాకినాడ, ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప్ర‌కృతి విపత్తుల నుంచి మ‌డ అడ‌వులు, హోప్ ఐలాండ్ ర‌క్షిస్తున్నాయ‌ని.. ఈ ప్రాంతాల‌ను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మ‌డ అడువుల‌కు మ‌రింత గుర్తింపు రావాల్సి ఉంద‌ని.. ఇందుకు స‌రైన కార్యాచ‌ర‌ణ అవ‌స‌ర‌మని, ఇందులో ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు భాగ‌స్వామ్యం క‌ల్పించేందుకు, పాత్రికేయుల‌ను ఆ దిశ‌గా న‌డిపించే ఉద్దేశంతో ఈ స‌ద‌స్సు ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. ప‌ర్యాట‌క, అట‌వీ, విద్య త‌దిత‌ర శాఖ‌లు స‌మ‌ష్టిగా విద్యార్థులు, యువ‌తకు మ‌డ అడ‌వుల ప్రాశ‌స్త్యంపై అవ‌గాహ‌న పెంపొందించాల‌ని సూచించారు. 1977, నవంబ‌ర్‌లో వ‌చ్చిన దివిసీమ ఉప్పెన ఎంతో విషాదాన్ని మిగిల్చింద‌ని.. ఇక్క‌డి మ‌డ అడ‌వులు ఎన్నో తుపాన్ల నుంచి కాకినాడ‌, ప‌రిస‌ర ప్రాంతాల‌ను ర‌క్ష‌ణ‌గా నిలుస్తున్నాయ‌న్నారు. జ‌ర్న‌లిజం ప‌విత్ర‌మైన, కీల‌క‌మైన వృత్తి అని విలువ‌ల‌తో కూడిన, నిర్మాణాత్మ‌క‌మైన పాత్రను జ‌ర్న‌లిస్టులు పోషించాల‌న్నారు. స‌త్యం, మాన‌వ‌త‌, విశ్వ‌స‌నీయ‌త‌, బాధ్య‌త‌, జవాబుదారీత‌నం..ఈ అయిదు అంశాలు పాత్రికేయుల‌కు ముఖ్య‌మ‌ని కొమ్మినేని శ్రీనివాస‌రావు పేర్కొన్నారు.

మ‌డ అడ‌వుల ఔన్న‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పే ప్ర‌య‌త్నం: ఎమ్మెల్యే పొన్నాడ వెంక‌ట స‌తీష్ కుమార్‌
ప్ర‌కృతి ప్ర‌సాదించిన‌, ప‌శ్చిమ‌బెంగాల్‌లోని సుంద‌ర్‌బ‌న్ మ‌డ అర‌ణ్య ప్రాంతం త‌ర్వాత అత్యంత ప్రాధాన్య‌మున్న కోరంగి మ‌డ అడ‌వుల‌ను ఔన్న‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పే ప్ర‌య‌త్నంలో భాగంగా స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్న‌ట్లు ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ వెంక‌ట స‌తీష్ కుమార్ తెలిపారు. మ‌డ అడ‌వులు ఈ ప్రాంతంలో ఉండ‌టం అదృష్ట‌మ‌ని, ఈ అడ‌వుల‌కు ఎలాంటి హానీ జ‌ర‌క్కుండా ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌త్స్య‌కార గ్రామాల్లో మ‌డ అడవుల గొప్ప‌ద‌నంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రింత ముమ్మ‌రంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌కృతి ప్ర‌సాదించిన మ‌డ అడవుల‌ను కాపాడుకుంటూ మ‌న భ‌విష్య‌త్ త‌రాల‌కు ఈ సంప‌ద‌ను అందించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌న్నారు. ఈ ప్ర‌య‌త్నంలో ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు మీడియా రెట్టింపు బాధ్య‌త‌తో కృషిచేయాల‌ని స‌తీష్ కుమార్ కోరారు.

మ‌డ అడ‌వుల‌పై శాస్త్రీయ అధ్య‌య‌నం జ‌ర‌గాలి: ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు
మడ అడ‌వుల‌పై స‌మ‌గ్రంగా శాస్త్రీయ అధ్య‌య‌నం జ‌ర‌గాల‌ని.. త‌ద్వారా అడ‌వుల సంర‌క్ష‌ణ‌కు మ‌రింత ప్రణాళికాయుత చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుంటుంద‌ని కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. ఆసియాలోనే ప్ర‌సిద్ధిపొందిన మ‌డ అడవుల్లో కోరంగి మ‌డ అడ‌వులు ఒక‌ట‌ని.. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌న్నారు. ఇక్క‌డి జీవ జాతులు అంత‌రించిపోకుండా చూడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు. గ‌తంలో తాను జ‌ర్న‌లిస్టుగా పిచ్చుక‌లు అంత‌రించిపోతున్న తీరుపై క‌థ‌నాన్ని రాస్తే అది ఓ మంచి, పెద్ద‌ చ‌ర్చ‌కు దారితీసింద‌ని.. జ‌ర్న‌లిస్టులు సామాజిక బాధ్య‌త‌గా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌స్వామ‌లుకావాల‌ని కోరారు. నేను ఓ జ‌ర్న‌లిస్టును అని చెప్పుకునేందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌న్నారు.

కోరంగి ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందుతోంది: యానాం ఎమ్మెల్యే శ్రీనివాస అశోక్‌
గ‌త 15 ఏళ్లుగా కోరంగి ప్రాంతం ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందుతోంద‌ని యానాం ఎమ్మెల్యే గొల్ల‌పల్లి శ్రీనివాస అశోక్ తెలిపారు. ఇక్క‌డికి వివిధ రాష్ట్రాల నుంచి ప‌ర్యాట‌కులు వ‌స్తున్నార‌న్నారు. ఇంత‌గా ఈ ప్రాంతం అభివృద్ధి చెంద‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. యానాం భౌగోళికంగా కేంద్ర‌పాలిత ప్రాంతంలో భాగ‌మైన‌ప్ప‌టికీ ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌తోనే మ‌మేక‌మై నివ‌సిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఎంతో విశిష్ట‌త క‌లిగిన ఈ ప్రాంతాన్ని సంర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కోరంగి అట‌వీ ప్రాంత ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ప్ర‌జ‌లు, మ‌త్స్య‌కారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో మీడియా భాగ‌స్వామ్యం కావాల‌ని అశోక్ కోరారు. కార్య‌క్ర‌మంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఎస్ఎస్ఆర్ వ‌ర‌ప్ర‌సాద్‌, టి.స‌త్య‌నారాయ‌ణ‌, తాళ్ల‌రేవు ఎంపీపీ రాయుడు సునీత గంగాధ‌ర్‌, త‌హ‌సీల్దార్ ఎస్‌.పోతురాజు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, సీనియ‌ర్ పాత్రికేయులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *