-దేవాలయ భూముల పరిరక్షణకు త్వరలో జీవో
-దుర్గగుడిపై చురుగ్గా అభివృద్ధి పనులు
-కార్తీక మాసానికి అందుబాటులోకి మల్లిఖార్జున స్వామి ఆలయం
-అనుమతుల కోసం అన్నదాన మండపం, ప్రసాదం పోటు నిర్మాణాలు
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న 1933 దేవాలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఆలయానికి రూ.10లక్షలు చొప్పున టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాలయ భూముల పరిరక్షణ కోసం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు త్వరలో జీవో రానుందన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని నెరవేర్చే దిశలో దుర్గగుడి అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్లో దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులతో దుర్గగుడి అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రిపై గల మల్లిఖార్జున స్వామి దేవాలయం పునర్నిర్మాణం, ప్రాకార మండపం నిర్మాణం, సివిల్ వర్క్స్ జులై 30వ తేదీ నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. గోపురంపై విగ్రహాల నిర్మాణం, ద్వజస్థంభ నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని అన్నారు. పవిత్ర కార్తీక మాసంలో మల్లిఖార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు గుడిలో విగ్రహాల ప్రతిష్ట జరిపేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంద్రకీలాద్రిపైన ఘాట్రోడ్డులో కొండరాళ్లు జారిపడకుండా చేపట్టిన ఐరన్ మెష్ ఏర్పాటు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఘాట్ రోడ్డులో రూ.4.20కోట్లతో డిజైన్, ఫ్యాబ్రికేషన్ సప్లై అండ్ ప్యానల్ బోర్డ్, ప్రొసిడింగ్ ఎనర్జీ అండ్ వాటర్ మేనేజ్మెంట్(స్కాడా) పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రూ.3.25 కోట్ల వ్యయంతో అన్నదాన మండపం నిర్మాణానికి గతంలో రూ.19.75 కోట్లు వెచ్చించగా ప్రస్తుత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దానిని రూ.30కోట్లకు పెంచారని తెలిపారు. అలాగే ప్రసాదం పోటు భవన నిర్మాణానికి గతంలో రూ.8.50 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పెంచారని వాటి నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు కోసం డీపీఆర్ సిద్ధం చేశామని చెప్పారు. పీపీపీ విధానంలో మల్టీ లెవల్ పార్కింగ్ కోసం రూ.60కోట్లు, ఎలివేటర్ క్యూ లైన్ల కోసం రూ.13 కోట్లతో టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై పూజా మండపాలు రూ.8.90కోట్లతో త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. శ్ర్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటికే 1933 ఆలయాలకు టి.టి.డి. నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అర్చకులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ హామీ మేరకు రిటైర్మెంట్ లేకుండా ఉండేందుకు త్వరలో జీవో విడుదల కానుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గుళ్లల్లోని అర్చకులకు రూ.10వేలు, రూ.15,625 వేతనాలుగా ఇవ్వనున్నామన్నారు. అలాగే అర్చకులకు ఆయా దేవాలయాల పరిధిలో స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న గుడులకు సంబంధించి వ్యవస్థాపక సభ్యులు, వారసత్వ అర్చకులు, గుర్తించబడిన సంస్థలకు అప్పగించేలా త్వరలోనే జీవో విడుదల కానుందన్నారు. ధూప, దీప పథకం కింద 4,600 గుళ్ళకు సహాయం అందజేసినట్లు తెలిపారు.