-రక్తదానంపై సమాజంలో చైతన్యం రావాలి..
-రక్తదాతలను ప్రోత్సహించేలా రెడ్ క్రాస్ కార్యక్రమాలు విస్తృతం చేయండి..
-రక్తదానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగిద్దాం…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తదానం చేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని సమాజంలో ఉన్న అపోహలను తొలగించేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా కలెక్టర్ ఢల్లీి రావు మాట్లాడుతూ కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే ఒక మానవతావాది రక్తంలో ఉండే గ్రూపులను వర్గీకరించి ఉండకపోతే ప్రపంచంలో ఇప్పటికీ రక్తమార్పిడి కారణంగా మరణాలు సంభవించేవన్నారు. అటువంటి మానవతా మూర్తి జయంతిని ప్రపంచ వ్యాప్తంగా రక్త దాతల దినోత్సవం గా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. నిస్వార్ధంగా రక్తదానం చేస్తున్నవారు మానవత్వానికి మరో రూపం అన్నారు. 61 సార్లు రక్తదానం చేసిన బి. ఎన్. సుధీర్ రక్తదాతతో మీరు ఎక్కువసార్లు రక్తదానం చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా తన మిత్రుడి తండ్రి సరైన సమయంలో రక్తం లభించక చనిపోవడంతో తాను సమాజానికి ఏదైనా చేయాలని సంకల్పం తోనే ఎక్కువసార్లు రక్తదానం చేశానన్నారు. నిజానికి రక్తదానం చేయటం వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు సహకరించిన నలంద డిగ్రీ కళాశాల, ఆంధ్ర లయోలా కళాశాల, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల, కేబీఎన్ కళాశాలల్లో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారులకు, రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను డిల్లీరావు అందజేశారు.
కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి. సమరం, ఏడి యంఎస్‌హెచ్‌వో డాక్టర్ ఉషారాణి, భారతీయ స్టేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.