-15లక్షల 21వేల మందికి ప్రయోజనం-ఎపి జిడిపిలో 2% కంట్రిబ్యూషన్ కు అవకాశం
-దేశంలో ఏపిలో మాత్రమే భూమి రీసర్వే ప్రక్రియ జరుగుతోంది
-2లక్షల 6వేల ఎకరాల చుక్కల భూములను 22-ఎ జాబితా నుండి తొలగించాం
-33వేల 428 ఎకరాలకు షరతులతో కూడిన పట్టాలు పంపిణీ చేశాం
-ఇళ్ళ స్థలాల పట్టాలు పొంది 10ఏళ్ళు పూర్తయితే అమ్ముకునే హక్కు కల్పించాం
-9వేల 600 ఎకరాల లంక భూములకు పట్టాలు గ్రాంటు చేశాం
-1.61లక్షల ఎకరాల ఈనాం భూములు 22-ఎ జాబితా నుండి తొలగింపు-1.13 లక్షల మందికి లబ్ది
-రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అసైండ్ భూములు పొందిన వారికి ఆభూములపై 20 ఏళ్ళ తర్వాత వారికి పూర్తి భూయాజమాన్యపు హక్కులు కల్పించడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు.స్వాతంత్ర్యానికి ముందు తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకూ 33లక్షల 29వేల ఎకరాలకు 19లక్షల 21వేల మందికి అసైండ్ భూములను పంపిణీ చేయగా వాటిలో 27లక్షల 41 వేల ఎకరాలకు సంబంధించి 15 లక్షల 21 వేల మందికి లబ్ది కలుగుతుందని చెప్పారు.ఈమేరకు శుక్రవారం వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 1977 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సుఫర్ యాక్టులో సవరణలు తీసుకువచ్చి గతంలో ఏప్రభుత్వం చేయని రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసాహసోపేతమైన అసైండ్ భూమున్నసాగుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు.దీనివల్ల రాష్ట్ర జిడిపికి 2శాతం కంట్రిబ్యూషన్ వచ్చే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.అసైండ్ భూములకు సంబంధించి గతంలో ఎవరైనా భూస్వాములు లేదా మరెవరైనా ఆభూములను కొన్నా, బలవంతంగా స్వాధీన పర్చుకున్నా కొనుగోలులు చెల్లవని ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ఆభూములను తిరిగి అసైనీలకు అప్పగించడం జరుగుతుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.
ఈప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక మార్పులు,సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఉదాహరణకు భూముల రీసర్వే విధానం దేశంలో ఎపిలో మాత్రమే జరుగుతోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.దీనివల్ల భూములకు సంబంధించిన చాలా వివాదాలు పరిష్కారం అవుతున్నాయని దీనిని భూములకు సంబంధించి ఒక ప్రధాన సంస్కరణగా చెప్పవచ్చని పేర్కొన్నారు.అంతేగాక భూములకు సంబంధించిన రికార్డులన్నీ పూర్తిగా అప్ డేట్ అవుతున్నాయని అన్నారు.భూరీసర్వే ప్రక్రియ మొదలు పెట్టాక ఇప్పటి వరకూ 19 లక్షల మ్యూటేషన్లు జరిగాయని మంత్రి తెలిపారు.
అదే విధంగా రాష్ట్రంలో 2లక్షల 2వేల ఎకరాల చుక్కల భూములను 22-ఎ జాబితా నుండి తొలగించి ఆయా రైతులకు ప్రయోజనం కల్పించడం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.గత ప్రభుత్వం చుక్కల భూముల అంశాన్ని ఏమాత్రం పట్టించు కోకుండా పక్కన పెట్టేయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ వచ్చారని, నేడు ఆసమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు.
ఇళ్ళ స్థలాలు తీసుకుని 10 ఏళ్ళు పూర్తయితే ఆయా స్థలాలను అమ్ముకునేందుకు వీలుగా 33వేల 428 ఎకరాల స్థలాలకు సంబంధించి 35 లక్షల మందికి లబ్ది కలిగించేలా షరతులతో కూడిన పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాకు వివరించారు.ఈనాం భూములకు సంబంధించి లక్షా 61 వేల ఎకరాలను 22-ఎ జాబితా నుండి తొలగించి లక్షా 13 వేల మందికి ప్రయోజనం కలిగేలా ఆభూములను పూర్వ స్థితికి తెచ్చామని తెలిపారు.అలాగే లంక భూములకు సంబంధించి 9 వేల 600 ఎకరాలను స్టెబిలైజ్ చేసి పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
ఈసమావేశంలో సిసిఎల్ఏ సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి,రెవెన్యూశాఖ సహాయ కార్యదర్శి గోపాల రావు తదితరులు పాల్గొన్నారు.