-ఈ నెల 28నుండి30 వరకు విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు
-దేశీయ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ మార్కెట్ ను పెంచాలనే లక్ష్యంతో ఫెస్టివల్ నిర్వహణ
-రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్య సంపద వినియోగాన్ని దేశీయంగా పెంచేందుకు, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చాలనే లక్ష్యంతో విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ నెల 28 నుండి 30 వ తేదీ వరకు విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో భూమి ఆర్గానిక్స్ సౌజన్యంతో ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సాలీనా 50 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో రాష్ట్రం ఆక్వా హబ్ గా పేరుగాంచినప్పటికీ దేశీయ వినియోగం చాలా తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మత్స్య సంపదను రాష్ట్రంలో సాలీనా ఒక వ్యక్తి కేవలం 8 కే.జి.లకు మించి వినియోగించుకోవడం లేదన్నారు. ఒకప్పుడు రొయ్యలను బ్రెజిల్ పూర్తిస్థాయిలో ఎగుమతి చేసేదని, అయితే డొమెస్టిక్ మార్కెట్ పెంచుకోవడం వల్ల స్థానికంగానే రొయ్యలను వినిగించుకునే స్థాయికి బ్రెజిల్ ఎదిగిందన్నారు. అదే స్థాయిలో మన రాష్ట్రం కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 75 శాతం మేర రొయ్యలు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంటే, వాటి వినియోగం మాత్రం రాష్ట్రంలో కేవలం 5 శాతం లోపే ఉందన్నారు. మిగిలిన రొయ్య అంతా రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్నదని, అంతర్జాతీయ మార్కెట్ పై ఆధార పడి ఆ రొయ్యరేటు ఉంటుందని, అక్కడ ఏమన్నా తేడా వస్తే మన రైతులు నష్టాలకు గురి కావాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇటు వంటి పరిస్థితులను అదిగమించేందుకు డొమెస్టిక్ మార్కెట్ ను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు మరియు మత్స్య సంపదను సాగు చేసే రైతులకు మేలు చేసే విధంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పర్చాలని రెండేళ్ల క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాను ప్రకారం తక్షణ చర్యగా ‘ఫిష్ ఆంధ్రా’ అనే ఒక బ్రాండ్ను గత ఏడాదిన్నర్ర కాలం నుండి విస్తృతంగా ప్రోత్సహించడం జరుగుచున్నదన్నారు. సీ ఫుడ్ వినియోగదారులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్యగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్ లో చికెన్, మటన్, గుడ్లు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ సమయం నిలువవుండని చేపలు, రొయ్యలు, పీతలు తదితర సీ ఫుడ్ ను అందుబాటులో ఉంచడమనేది సవాలుతో కూడుకున్న విషయమన్నారు. ఈ సమస్యను అదిగమించి తాజాగా గానీ, ప్యాక్డు రూపంలో గానీ సీ ఫుడ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తేవడం జరిగిందన్నారు. ఇందులో బాగంగా సుమారు 1,500 అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేయగా 26 హబ్స్ ను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించడమైందన్నారు. మొత్తం 26 హబ్స్ లో 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నాయని, మూడు ఆపరేషన్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్న చోట మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ ను వేదికగా చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్లో ఆక్వా రైతులు, మత్స్యకారులు, సీ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రమోటింగ్ యూనిట్స్ ప్రతినిధులు మరియు సాదారణ పౌరులు మొత్తం దాదాపు 20 వేల మంది సందర్శకుల వరకూ పాల్గొనే అవకాశం ఉందన్నారు. మత్స శాఖ పరంగా పది స్టాళ్లను, నాలెడ్జు పార్టర్ అయిన భూమి ఆర్గానిక్స్ వారు కూడా పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రూ.699/- లతో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీ ఫుడ్ పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2K రన్ ను కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ లో నిర్వహించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. విజయవాడతోనే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ అగిపోదని, ఇటు వంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే విధంగా రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాలతో పాటు హైద్రాబాదు, బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నామన్నారు.
భూమి ఆర్గానిక్స్ ప్రతినిది రఘురామ్ మాట్లాడుతూ మానవునికి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చే ఒమెగా 3 ఫాటియాసిడ్స్ చేపలో సమృద్దిగా ఉన్నాయని, ఇతర మాంసాహారాల కంటే చేపల వినియోగం ఎంతో మంచిదని అన్నారు. ఆరోగ్య కరమైన ఆహారాన్ని వినియోగదారులు పెద్దఎత్తున ఉపయోగించుకునేందుకు తమ సంస్థ పెద్ద ఎత్తున కృషిచేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు వి.వి.రావు, హీరా నాయక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.