Breaking News

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ‘వీరుల’కు నివాళులు అర్పించేందుకు ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారం

-గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా జన భాగీధారి కార్యక్రమాలు నిర్వహణ
-గ్రామ పంచాయతీల్లో శిలాఫలకాలు (స్మారక ఫలకాలు) ఏర్పాటు
-అమృత వాటిక రూపకల్పన కోసం దేశంలోని మూలమూలల నుంచి మట్టిని దిల్లీకి తీసుకురావడానికి అమృత కలశ యాత్ర

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ, ఇటీవలి ‘మన్ కీ బాత్’లో, ‘మేరీ మాటీ మేరా దేశ్’ ప్రచారాన్ని ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర స్వాతంత్ర్య సమరయోధులను, వారి ధైర్యసాహసాలను గౌరవించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ ప్రచారంలో భాగంగా, వీరులను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. వీరుల త్యాగలను గుర్తు చేసే శిలాఫలకాలను గ్రామ పంచాయతీల్లోని అమృత్‌ సరోవర్‌లకు సమీపంలోని ఏర్పాటు చేస్తారు. 2021 మార్చి 12వ తేదీన ప్రారంభమైన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్’కు ఈ ప్రచారం ముగింపు కార్యక్రమం. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్’లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా కార్యక్రమాలు జరిగాయి, ప్రజలు పెద్ద సంఖ్యలో (జన్ భాగీదారి) పాల్గొన్నారు.

ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారాన్ని గ్రామాలు, బ్లాక్ స్థాయుల్లో స్థానిక పట్టణ సంస్థలు చేపడతాయి. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లోనూ కార్యక్రమాలు జరుగుతాయి.

‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారంలో స్వాతంత్ర్య సమరయోధులు, భద్రత బలగాలకు శిలాఫలకాలు ఏర్పాటు చేయడంతో పాటు పంచ ప్రాణ ప్రతిజ్ఞ, వసుధకు వందనం, వీరులకు వందనం వంటి కార్యక్రమాలు ఉంటాయి. గ్రామం, పంచాయతీ, బ్లాక్, పట్టణం, నగరం, మునిసిపాలిటీ ప్రాంతాలకు చెందిన వీరుల త్యాగ స్ఫూర్తికి వందనం చేసేలా రూపొందించే శిలాఫలకాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వాటిపై, దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ ప్రాంత వీరుల పేర్లతో పాటు ప్రధాని సందేశం కూడా ఉంటుంది.

దిల్లీలో ‘అమృత వాటిక’ను రూపొందించేందుకు 7,500 కలశాలతో దేశం నలుమూలల నుంచి మట్టిని తీసుకెళ్లే ‘అమృత కలశ యాత్ర’ నిర్వహిస్తారు. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ నిబద్ధతకు ఈ ‘అమృత వాటిక’ ప్రతీకగా నిలుస్తుంది.

ప్రజల సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి (జన్ భాగీదారి) https://merimaatimeradesh.gov.in వెబ్‌సైట్ ప్రారంభించారు. ప్రజలు, మట్టి లేదా ప్రమిదలు పట్టుకుని దిగే సెల్ఫీలను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. దీనివల్ల, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, బానిసత్వ మనస్తత్వాన్ని నిర్మూలించడం, మన గొప్ప వారసత్వం గురించి గర్వపడడం, ఐక్యత & సంఘీభావాన్ని చాటడం, పౌరులుగా విధులను నిర్వర్తించడం, దేశాన్ని రక్షించేవారిని గౌరవించడం వంటి లక్ష్యాలతో ప్రజలు పంచ ప్రాణ ప్రతిజ్ఞ చేస్తారు. ప్రతిజ్ఞ తర్వాత, ఇందులో పాల్గొన్న వాళ్లు డిజిటల్ ధృవపత్రాన్ని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారం ప్రారంభమవుతుంది, ఆగస్టు 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత, ఆగస్టు 16 నుంచి బ్లాక్, మున్సిపాలిటీ/కార్పొరేషన్, రాష్ట్ర స్థాయుల్లో నిర్వహిస్తారు. ఆగస్టు 30న, న్యూదిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రముఖుల సమక్షంలో ముగింపు వేడుక జరుగుతుంది. ‘మేరీ మాటీ మేరా దేశ్’ ప్రచారంలో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల సమాచారం కోసం https://yuva.gov.in పోర్టల్‌ను చూడవచ్చు.

హర్ ఘర్‌ తిరంగ: గత సంవత్సరం, “హర్ ఘర్‌ తిరంగ” కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సంవత్సరం కూడా, హర్ ఘర్‌ తిరంగ కార్యక్రమాన్ని ఈ నెల 13-15 తేదీల్లో నిర్వహిస్తారు. భారతీయులు ఎక్కడ ఉన్నా, ఆ 3 రోజుల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జెండాతో సెల్ఫీ దిగి, హర్ ఘర్ తిరంగ వెబ్‌సైట్‌లో (hargartiranga.com) అప్‌లోడ్ చేయవచ్చు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *