-ద్వారకా తిరుమల మండల స్థాయి వైఎస్సార్ ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి
ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళల పేరు మీదనే ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలాల్లో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతల్లో 25,571 కోట్ల రూపాయలను వైయస్సార్ ఆసరా పథకం కింద ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఇంతటి మొత్తం రాష్ట్రంలో మరే సంక్షేమ పథకానికి వినియోగించ లేదన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలో పేదరికం 12% నుండి ఆరు శాతానికి తగ్గిందన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచుకు పుట్టింటి కానుకగా ఇళ్ల స్థలాలను జగనన్న ప్రభుత్వం అందించిందన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. మన రాష్ట్రంలో జరిగిన మహిళా సాధికారిత మరే రాష్ట్రంలో జరగలేదన్నారు. రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే విధంగా ప్రతి పిల్లవాడిని చదివించండి.. మేనమామ వారిని చదివించే బాధ్యతను నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చారని ఆమె తెలిపారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిల్లల భవిష్యత్ కోసం ఆలోచనలు చేస్తు విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైన పౌష్ఠికాహారం దగ్గర నుండి మన బడి నాడు నేడు ద్వారా పిల్లలకు కార్పొరేట్ విద్యను చేరువ చేశారన్నారు. విద్యాకానుక ద్వారా బుక్స్, యూనిఫాం, షూస్ వంటి వస్తువులు కూడా అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుందన్నారు. కరోనా సమయంలో కూడా ఎప్పుడూ సంక్షేమం ఆపలేదని మంత్రి గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం, సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి మరీ సంక్షేమం అందజేస్తున్నామన్నారు. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తూన్నారంటూ ప్రతిపక్ష వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏ అవకాశం లేని ప్రతిపక్షం దీనిపై విమర్శలు చేయడం వారి చౌకబారుతనాన్ని తెలియజేస్తుందన్నారు. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే అవునా కాదా అంటూ డ్వాక్రా మహిళలను ప్రశ్నిస్తే.. చేస్తాడు, చేస్తాడు అంటూ సభాప్రాంగణమంతా హోరెత్తింది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల మహిళలకు నేరుగా లబ్ధి చేకూర్చారన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.