Breaking News

ధర్మానిదే విజయం… పొత్తుదే గెలుపు… కూటమిదే పీఠం

-నేను దేవదత్తం పూరించాను… మోడీ పాంచజన్యం పూరిస్తారు
-ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం
-ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి
-డబ్బు మదంతో అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు
-చిటికెన వేలంత ఈ రావణుడిని దించడం మనకో ఓ లెక్కా…?
-ప్రజాగళం బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘బంగారంతో కట్టిన లంక… వజ్ర వైఢూర్యాలతో నిర్మించిన పుష్పక విమానం… ధీరులు, శూరులు, మందీమార్భలంతో రెచ్చిపోయిన రావణాసురుడ్ని నారవస్ర్తాలు ధరించిన శ్రీరాముడు నేల మీద నిలబడి బాణంతో సంహరించాడు. డబ్బు మదంతో అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ… రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన ఈ చిటికెన వేలంత రావణాసురుడిని గద్దె దించడం ఒక లెక్కా?’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమైందని, అర్జునుడి స్థానంలో నేను నా దేవదత్తాన్ని తాడేపల్లిగూడెంలో పూరించానని, శ్రీ కృష్ణుడి స్థానంలో అయోధ్యలో రాముడ్ని ప్రతిష్ఠించిన ప్రధాని మోదీ పాంచజన్యం పూరిస్తారని అన్నారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానిదే విజయం… పొత్తుదే గెలుపు… కూటమిదే పీఠం అని చెప్పారు. ఆదివారం ప్రజాగళం పేరిట జనసేన- తెలుగుదేశం- బీజేపీ మూడు పార్టీల ఉమ్మడిగా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మూడు పార్టీల నేతలూ పాల్గొన్నారు.
ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “పితృదేవతల ముక్తి కోసం వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లోని గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది ధార కోసం ఎలా ఎదురుచూస్తున్నారో… అలా నరేంద్ర మోదీ రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానీకం, దాష్టీకం తోటి, దోపిడీ తోటి నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానీకం, అవినీతి, ప్రజాస్వామిక విధానాలతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానీకం ఎదురు చూస్తోంది. హిమాలయాల నుంచి గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి ఎలా సేద దీర్చిందో మన ప్రధాని నరేంద్ర మోదీ రాక, ఈ ఎన్డీయే మరోసారి కలయిక 5 కోట్ల మంది ఆంధ్రులకు అలా ఆనందాన్ని ఇచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ప్రధాని మోడీ హ్యాట్రిక్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు మొదలైంది. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులతో ఘన విజయం సాధించాం. ఇప్పుడు 2024లో దుర్గమ్మ సాక్షిగా మళ్లీ పొత్తు వికసించింది. అంతకు మించి విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోవాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ ఇక్కడికి వచ్చారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేను అండగా ఉన్నానని వచ్చిన మోదీ కి ఘనస్వాగతం పలుకుదాం.

డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది
అవినీతి, నల్లధనాన్ని తగ్గించడానికి మోడీ దేశాన్ని డిజిటల్ పేమెంట్స్ వైపు తీసుకెళ్తుంటే… రాష్ట్రంలో జగన్ మాత్రం నల్లధనాన్ని పెంచి పోషిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద ఓన్లీ క్యాష్ నో డిజిటల్ పేమెంట్స్ అంటూ బోర్డులు పెడుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి సారా వ్యాపారిలా మారిపోయాడు. ఐదేళ్లలో రూ.1,13,580 కోట్ల అమ్మకాలు జరిపి… రూ. 84,050 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగినట్లు చూపిస్తున్నారు. కేంద్రానికి కట్టాల్సిన రూ. 10వేల కోట్ల ట్యాక్స్ ను ఎగ్గొట్టారు. జేపీ వెంచర్స్ పేరుతో జగన్ బినామీలు ఇసుకను కొల్లగొట్టారు. దాదాపు రూ. 40 వేల కోట్లు దోచుకుంటున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించారు. ఇసుక దోపిడీపై వార్తలు రాసిన చిత్తూరు జిల్లా విలేకరిని హత్య చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దాదాపు 30,196 మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారు. హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. 18 ఏళ్లలోపు ఉన్న వాళ్లు 7,918 మంది, 18 ఏళ్లు దాటిన వాళ్లు 22,278 మంది అదృశ్యమైనట్లు వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటికి స్పందన లేదు. ఒకవైపు ఆత్మనిర్బర భారత్ అని దేశం అభివృద్ధి చెందుతుంటే పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను తీసుకొస్తుంటే.. మన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి నెగిటివ్ గ్రోత్ లోకి వెళ్లిపోయింది.

పొత్తు గెలవాలి… వైసీపీ పోవాలి
డబ్బు మదంతో జగన్ అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తల పొట్టల్లో కత్తులు దింపుతున్నారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డిని మర్డర్ చేసిన ప్రభుత్వం ఇది. అక్రమంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని అరెస్టు చేసిన ప్రభుత్వం ఇది. విశాఖలో జనవాణి కార్యక్రమం చేయకుండా నన్ను అడ్డుకున్నారు. ఈ ప్రభుత్వం పోవాలి. ఉమ్మడి ప్రభుత్వం రావాలి” అన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *