అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం అయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. చిలకలూరిపేట బొప్పూడిలో ‘ప్రజాగళం’ సభలో ఈ ముగ్గురు అగ్ర నేతలు వేదిక పంచుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీ పలనాడు జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అభివర్ణించారు. జనం దృష్టి మరల్చేందుకు రెండు పార్టీ ప్రయత్నిస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.
ఈ రోజు నుండి అసలు ప్రజాస్వామ్యం ప్రారంభమైందని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు. సభకు హాజరైన వారందరి చేత మొబైల్లోని ఫ్లాష్‌ని ఆన్ చేసి, వేడుకకు స్వాగతం పలకాలని ప్రధాని మోదీ అభ్యర్థించారు. ఈ భారీ జన సముద్రం ఢిల్లీకి కూడా సందేశం ఇస్తుందన్న ప్రధాని, ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి సందేశం ఇస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్రపక్షాల బహిరంగ సభ జరగడం ఇదే తొలిసారి. ఈ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదంతో జనంలోకి వచ్చిన చెప్పిన ప్రధాని మోదీ జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వేరు కాదన్న ప్రధాని మోదీ.. ఈ రెండూ ఒకటే అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీలను నడుపుతున్నారు. ప్రభుత్వంపై కోపంగా ఉన్నవారు ఎన్డీయే లాభపడకుండా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ గర్వాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తోందని ధ్వజమెత్తారు ప్రధాని. దేశ నాయకులను గౌరవించేది బీజేపీ మాత్రమే అన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేసిన ఘనత ఎన్డీయేకే దక్కతుందన్నారు. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్.. తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారన్నారు. ఆయన పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరమన్న ప్రధాని. తెలుగు వారికి కాంగ్రెస్ చేసిన అవమానంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ ఎలా అవమానించింది మర్చిపోలేమన్నారు. తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఎన్డీయే ప్రభుత్వం.. ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది’’ అని మోదీ చెప్పారు.
ఎన్డీయేలో అందరినీ వెంట తీసుకెళ్తాం, కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమిలోని ప్రజలను ఉపయోగించుకోవడం, పారద్రోలడమే ఏకైక ఎజెండా అన్నారు. కాంగ్రెస్ కూటమిని ఏర్పాటు చేయవలసి వచ్చింది. కానీ వారి ఆలోచన అలాగే ఉంది. బెంగాల్లో టీఎంసి, వామపక్షాలు పరస్పరం ఏం చెబుతున్నాయి? పంజాబ్‌లో కాంగ్రెస్ – ఆప్ ఒకరినొకరు ఏ భాషలో మాట్లాడుకుంటారు? అన్నదీ దేశ ప్రజలు గమనిస్తున్నారు.
ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్4న రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 పైగా సీట్లు రావాలి. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటే ఎన్డీయేకు 400+ సీట్లు వచ్చేలా కృషి చేయాలన్నారు. ఎన్డీయే కూటమికి ప్రాంతీయ భావాలతోపాటు, జాతీయ భావాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్రరాష్ట్ర వికాసానికి చేసిన కృషిని గుర్తించాలని కోరారు. ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారతదేశం. ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలి. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతున్నారు ప్రధాని మోదీ.
ఆంధ్రా యువత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దేశాన్ని పెద్ద ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తున్నామన్నారు. తిరుపతిలో ఐఐటీ, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహా పలు అత్యున్నత సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని ప్రధాని గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వల్ల పలనాడు నిరుపేద ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. ఎన్డీయే ఎమ్మెల్యేలు గెలవాలి. ఎన్డీయే ఎంపీలందరూ గొప్ప సేవతో మీ కోసం పని చేస్తారన్న మోదీ హామీ ఇచ్చారు.
దేశంలో ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి పనులపై చర్చ జరుగుతోంది. ఇక్కడ పలనాడులో దాదాపు 5000 శాశ్వత ఇళ్లు నిర్మించి పేదలకు అందించారు. కోటి కుటుంబాలకు కుళాయి కనెక్షన్ లభించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, ఆంధ్రప్రదేశ్‌లో 1.25 కోట్ల మందికి పైగా పేదలు ఉచిత చికిత్స పొందారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం,. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను సృష్టించడమే NDA లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డిఎ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటం ఇక్కడి అభివృద్ధికి మరింత ఊపునిస్తుందన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదలకు సేవ చేసే ప్రభుత్వం. పేదల గురించి పట్టించుకునే ప్రభుత్వమిదని మోదీ అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయడు…
ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయడు కేంద్రం చేస్తున్న పలు పథకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. నోట్ల రద్దు, జీఎస్డీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నేడు కొత్త కోణంలో ఉందన్నారు. కరోనా సమయంలో, ప్రధాని మోదీ తన విధానాల ద్వారా కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. దేశానికి సరైన సమయంలో ప్రధాని మోదీ లాంటి నాయకుడు దొరికాడన్నారు. మేము మీతో ఉంటాము, ఇది మా వాగ్దానం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయడు. ప్రజల ఆశీర్వాదం మాకు ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణ సభ ఇదని, ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ అన్నారు చంద్రబాబు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు ఒకటయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు చంద్రబాబు. మూడు పార్టీ జెండాలు వేరైనా, అజెండా ఒక్కటే అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తపించే పార్టీలని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ఒక వ్యక్తి కాదని, దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి అన్నారు చంద్రబాబు. మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం.. ప్రపంచ మెచ్చిన మేటి నాయకుడన్నారు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచం మెచ్చిన మెరుగైన నాయకుడు మోదీ అని అన్నారు.
పేదరికం నిర్మూలన కోసం మోదీ చేస్తున్న కృష్టికి , ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలన్నారు. వికసిత్ భారత్‌కు ఇదే సరైన సమయం అన్న చంద్రబాబు.. అందుకు మనమంతా మోదీతో ఉండాలన్నారు. భారత్‌ను నెంబర్ 1గా మార్చే శక్తి మోదీకి ఉందన్న చంద్రబాబు, భారత్ శక్తివంతమైన జాతిగా చేయగల సత్తా ఆయనలో ఉందన్నారు. దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల వలయంలో కొట్టిమిట్టాడుతుందని గుర్తు చేశారు. 2014 విభజన తర్వాత సవాళ్లు, సమస్యలు అధిగమించామని, ఎన్డీయేలో భాగస్వాములయ్యాం. అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 11 జాతీయ విద్యా సంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. దేశంలోనే ఉత్తమ రాజధానిగా అమరావతిని నిర్మాణానికి పునాదులు వేస్తే, మూడు ముక్కల మాటలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ఆరోపించారు. పోలవరాన్ని గోదావరిలో కలిపారన్న చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా సహజ వనరులు దోచేశారన్నారు. జె బ్రాండ్‌తో కల్తీ లిక్కర్ తెచ్చి అనేకమంది ప్రజలను బలితీసుకున్నాడని విరుచుకుపడ్డారు చంద్రబాబు.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను జగన్ తరిమేశాడన్న చంద్రబాబు.. ఐదేళ్లలో రోడ్లు లేవు.. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధేలేదని ధ్వజమెత్తారు. ప్రజల గుండెల్లో మనశ్శాంతి లేదన్న చంద్రబాబు, బంగారు రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశాడని ఆరోపించారు. గతంలో లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేసిన జగన్ అధికార దాహానికి బాబాయ్ బలయ్యాడన్నారు. ఇద్దరు చెల్లెళ్లు రోడెక్కి జగన్‌కు ఓటు వేయొద్దని చెప్పారంటే ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోందన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్డీయే 400కు పైగా సీట్లు వస్తాయన్న చంద్రబాబు, ఏపీలో 25 సీట్లు గెలిపించే బాధ్యత మీదే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి పట్టం కట్టి, రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాలని చంద్రబాబు నాయుడు అభ్యర్డించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్…
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం పలికారు పవన్. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారని పవన్ పేర్కొన్నారు. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం పవన్ చెప్పారు. ఐదుకోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని.. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకు మోదీ వచ్చారన్నారు పవన్. ఎన్డీఏ కలయిక.. ఐదుకోట్ల మంది ప్రజలకు ఆనందం అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారని పవన్ చెప్పారు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రావణ సంహారం జరుగుతుంది.. త్వరలోనే రామరాజ్య స్థాపన జరుగుతుందన్నారు పవన్. అమరరాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏపీ నుంచి వెళ్లిపోయాయని.. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా.. ఈరోజు -3 శాతానికి దిగజారిపోయిందన్నారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఏపీ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చిందన్నారు.