-10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా నున్న దాదాపు 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా సోమవారం శ్రీకారం చుట్టారు. పోస్టల్ శాఖ ముద్రించిన పలు రకాల ఓటర్ల అవగాహనా పోస్టర్లను అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ జనరల్ కందుల సుధీర్ బాబుతో కలసి ఆయన తమ ఛాంబరులో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యం (SVEEP – Systematic Voters’ Education and Electoral Participation) కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ ఒప్పందం అమల్లో భాగంగా పలు రకాల పోస్టర్లను పోస్టల్ శాఖ ముద్రించడం జరిగిందన్నారు. ఆయా పోస్టర్ల ద్వారా రాష్ట్రంలోని 57 హెడ్ పోస్టాఫీసులు, 1,512 సబ్ పోస్టాఫీసులు మరియు 9,101 బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటు విలువను మరియు ఎన్నికల ప్రాముఖ్యతను రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి యువత గుర్తించి రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ (మార్కెటింగ్) జి.ప్రసన్న వెంకట సాయి పాల్గొన్నారు.