Breaking News

కొత్త ప్రభుత్వం విద్యా వ్యవస్థను సరిదిద్దాలి

-యుటియఫ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన మార్పుల వల్ల కలిగిన నష్టాలను సరిదిద్ది రాష్ట్రంలో ఏర్పడబోతున్న నూతన ప్రభుత్వం, ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కె. ఎస్. ఎస్. ప్రసాద్ కోరారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి యుటియఫ్ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది. నూతనంగా ఏర్పడబోతున్న ఈ ప్రభుత్వం జూన్ 9న ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని సరిదిద్దే చర్యలు ప్రకటించాలి.

వాటిలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్ సి ప్రకటిస్తూ మొదటి సంతకం చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా వున్న 28వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే విధంగా మెగా డిఎస్ సి ప్రకటించాలి. జిఓ 117ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. జిఓ 117 కారణంగా రాష్ట్రంలో 13వేల పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్గా మారిపోయినందున విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా, ప్రతి ఉన్నత పాఠశాలలో తగినంతమంది సబ్జెక్టు టీచర్లు ఉండేవిధంగా తగు నిర్ణయం ప్రకటించాలి.

పై హామీలతో బాటు రాష్ట్రంలో విద్యార్థులు తమకు నచ్చిన మీడియంలో చదువుకునేలా అన్ని పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియంలు రెండింటిని కొనసాగించాలి. ప్రాథమిక పాఠశాలలను రెండుగా విభజించిన కారణంగా ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ బాగా తగ్గిపోయింది. విద్యార్థులు తలిదండ్రులు కూడా పలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి 1 నుండి 5 తరగతులను ఒకే పాఠశాలగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రతి గ్రామంలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, అన్ని సౌకర్యాలు కలిగిన ఒక మంచి పాఠశాల ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు మూడు రకాల సిలబస్ లో ఏదో ఒక దానిని ఎంచుకోవలసి వస్తున్నది. దీనిని సమీక్షించి రాష్ట్రమంతటా ఒకే సిలబస్ ఉండే విధంగా కూడా తగు చర్యలు చేపట్టాలి.

పై అంశాలను సరిదిద్దడం ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి నూతన ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటూ, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు విశ్వాసం కలిగించేలా నూతన ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *