-విజయం నాకు అహంకారం ఇవ్వదు… అదో పెద్ద బాధ్యతగా భావిస్తాను
-జనసేన నూటికి నూరు శాతం విజయం సాధించడం అపూర్వం
-వైసీపీపై కక్ష సాధింపు చర్యలుండవు
వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గిస్తాం
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన పునాదులు నిర్మించేలా కూటమి పాలన ఉంటుంది
-చీకటి రోజులు పోయాయి… కలిసికట్టుగా పనిచేసే రోజులు వచ్చాయి
-చారిత్రక విజయానంతరం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘జనసేనను 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత బలంగా నమ్మారంటే- పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడం సాధారణ విషయం కాదు. దేశంలో మరే పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా 100 శాతం విజయాన్ని ఇప్పటి వరకు అందుకోలేదు. విజయం వల్ల నాకిప్పుడు అహంకారం కలగలేదు. విజయాన్ని నేను బాధ్యతగా భావిస్తాను. మనల్ని నమ్మిన వారి ఆకాంక్షను తీర్చాల్సిన అతి పెద్ద బాధ్యతగా ఈ విజయాన్ని స్వీకరిస్తాను. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు చీకట్లు వీడిపోయే సమయం వచ్చింది. చాలా జాగ్రత్తగా, ప్రజలకు జవాబుదారీగా పాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. అనా కొణిదెల, అకీరా నందన్, సాయి ధరమ్ తేజ్ వచ్చారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో సంబరాలు జరుపుకునేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు జయజయ ధ్వానాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ “ఐదు కోట్ల మంది ఆంధ్రులు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ప్రజలకు జవాబుదారీ పాలన అనే మాటకు కట్టుబడి ఉంటుంది. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. రాష్ట్ర పునాదులు బలంగా వేసేందుకు పని చేస్తాం. ఎవరిపైనా కక్షలు తీర్చుకోవడానికో, రాజకీయ శత్రువులను ఇబ్బందిపెట్టడానికో పని చేయం. ఇది అత్యంత కీలకమైన సమయం. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే సమయం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నలుగుతున్న రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయాలి. ఓ తపస్సులా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేలా పాలన ఉంటుంది.
జగన్ మీద వ్యక్తిగత ద్వేషం ఎప్పటికీ ఉండదు
వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మీద నాకు ఎప్పటికీ వ్యక్తిగత ద్వేషం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గౌరవిస్తాం. వైసీపీ ఓడిపోయింది కదా అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను హింసించడానికి కూటమి ప్రభుత్వం పని చేయదు. వైసీపీని ఇబ్బందిపెట్టడానికి ప్రజలు ఇంతటి విజయం అందించలేదు. ఈ విషయాన్ని జన సైనికులు, నాయకులు, వీర మహిళలు గుర్తుంచుకోవాలి. వ్యవస్థలను రక్షించడానికి, గౌరవించడానికి తగిన ప్రాధాన్యత ఇస్తాం.
నా జీవితంలో విజయాలు అంత తేలిగ్గా రాలేదు. తొలి ప్రేమ మొదటి విజయం తర్వాత సినిమాల్లో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. నేను రాజకీయాల్లోకి డబ్బు కోసమో, కీర్తి కోసమో రాలేదు. సగటు మనిషి పడే బాధలు, వేదనలు నాలో కలిగి వాటికి సమాధానం వెతికే ప్రయత్నంలోనే రాజకీయాల్లోకి వచ్చాను. సామాన్యుడి బాధలు, యాతనలు ఎవరూ తీర్చలేరా? అనే ప్రశ్నే నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. సామాన్యుడికి పూర్తి స్థాయిలో భరోసాగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కావాలి అని బలంగా కోరుకున్నారు. పాలన మారాలి అని ఆకాంక్షించారు. అది తీరింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ బలమైన పునాదులు నిర్మించాలి.
ఏరు దాటాక తెప్ప తగలేసేవాడిని కాదు
ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. పది మందికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచేలా, ఆడ బిడ్డలకు పూర్తి స్థాయి రక్షణ అందించేలా, మహిళలను సర్వ సత్తాకంగా నిలిపేందుకు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సావధానంగా వినేలా, యువత ఆకాంక్షలు తీరేలా, కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల ముందు ఉద్యోగులకు సీపీఎస్ రద్దు మీద హామీ ఇచ్చాం. దాని పరిష్కారానికి అందరూ మెచ్చేలా ఏడాదిలో పరిష్కార మార్గం చూపిస్తాం. నేను ఏ సమస్య కూడా వదిలేసేవాడిని కాదు. ఏరుదాటాక తెప్ప తగలేసే రకం అసలే కాదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేలా పాలన ఉంటుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత తీసుకుంటా. యువతకు సరైన మార్గంలో నైపుణ్యం అందించి వారికి తగిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బలంగా ఉండేలా పని చేస్తాం. వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గించి ఎవరి పని వారు సక్రమంగా చేసేలా చూస్తాం. రైతుకు అనుకోని కష్టం వస్తే అక్కున చేర్చుకునే ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారు. సగటు మనిషికి భుజం కాసే ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారు.
నా మానసిక స్థితి ఎప్పుడూ ఒకేలా ఉంది
ఉన్నత లక్ష్యం కోసం రాజకీయ ప్రయాణం ప్రారంభించినప్పుడు, 2019లో రెండు చోట్ల ఓడిపోయి ఘోర పరాజయం పొందినప్పుడు ఈ ఆఫీసులో ఒక్కడినే ఉన్నప్పుడు ఎలాంటి మానసిక స్థితి ఉందో ఇంతటి ఘన విజయం సాధించినప్పుడు కూడా నేను అదే మానసిక స్థితిలో ఉన్నాను. నాకు గెలుపు బాధ్యతనిస్తుంది. ఇల్లు అలకగానే పండగ కాదు అని నాకు తెలుసు. చాలా బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీలు వారి కష్టాలను తీర్చేలా పని చేసేందుకు అహర్నిశలు పోరాడుతాను. ధర్మో రక్షతి రక్షిత: అని నమ్మిన వాడిని. ఆ ధర్మం కోసం నిలబడ్డాం. ఆ ధర్మమే ఇప్పుడు మనల్ని గెలిపించింది. కనిపించని ప్రతి శక్తికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
పిఠాపురం ప్రజలందరికీ అక్కడి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిఠాపురం ప్రజలు. ఆకాశమంత విజయం ఇచ్చారు. నిర్మాణాత్మకంగా నిలబడతాం. ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలతా పవన్ కళ్యాణ్ అంటే ఎవరో బయటి వ్యక్తి.. నాయకుడు అనుకోకండి. పవన్ కళ్యాణ్ మీ ఇంట్లోని వాడు. మీ కుటుంబ సభ్యుడు అనుకోండి. ఏ కష్టం వచ్చినా నా కార్యాలయం తలుపులు, నా ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయి” అన్నారు.