Breaking News

విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించిన మంత్రి

-కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
-ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
-రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం
-విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శించారు. గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సోమవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రి నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి భోజనశాల, వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూలు సిబ్బందితో మంత్రి మాట్లాడారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. కేర్ టేకర్స్ విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.
విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రితో పాటు విద్యార్థులను పరామర్శించిన వారిలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు ఉన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ
డా.బి.ఆర్. అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాల నందు ఉన్న 520 పిల్లలలో 120 మంది పిల్లలు వాంతులు, విరేచనాలకు గురయ్యారని,వీరందరికి మెరుగైన చికిత్స అందించడం కోసం నాయుడుపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, గూడూరు ప్రాంతీయ ఆసుపత్రి, సూళ్లూరుపేట సి హెచ్ సి కు రాత్రి నుండి తరలించడం జరిగిందని అన్నారు. ఏడుగురు పిల్లలను మాత్రం జి జి హెచ్ నెల్లూరు కు మెరుగైన వైద్యం కోసం షిఫ్ట్ చేయడం జరిగిందనీ ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు.

సదరు పాఠశాలలో ఉన్న మిగిలిన పిల్లల ఆరోగ్య భద్రతపై 8 డాక్టర్లను , 30 ఎం ఎల్ హెచ్ పి లను పెట్టామని
పిల్లలకు ఓ ఆర్ ఎస్ , ఐవి ఫ్లూయిడ్స్ వంటివి ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇక్కడి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సిఎం కార్యాలయానికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి తెలియపరచడం జరుగుతోందని, ఈ రోజున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాలా వీరాంజనేయ స్వామి వారు కూడా అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారని, అస్వస్థతకు గల కారణాలను పాఠశాలలను ప్రత్యక్షంగా సందర్శించి స్వయంగా పరిశీలించారని అన్నారు. మరలా ఈ కేసులు పునరావృత్తం కాకుండా హెల్త్ టీం లను ఏర్పాటు చేశామని తెలిపారు.

పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడామని,వారు కూడా హాస్టల్ లోని కొన్ని సమస్యలు తెలిపారని, వాటిని కూడా పై అధికారులకు తెలిపామని అన్నారు. పారిశుద్ద్య లోపం, గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అలసత్వం కారణంగా పిల్లలు అతిసారం కు గురయ్యారని తెలుపుతూ సమగ్ర విచారణ అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *