విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. అదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు సామాజిక న్యాయం స్ఫూర్తి కలిగిన తీర్పుగా భావిస్తున్నాం అన్నారు. ఇప్పటికైనా దళితుల మధ్య ఉన్న వైషమ్యాలు విడనాడి అందరూ సమిష్టిగా సంఘటితంగా అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం పోరాడాలి అని పిలుపు నిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడిలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ గతం 30 సం.ల పోరాటంలో ఎంతోమంది కార్యకర్తలు ఆత్మ బలిదానాలు చేయటమే కాకుండా వేలాదిమంది కార్యకర్తలు జైలు పాలయ్యారన్నారు. సుదీర్ఘ పోరాటం నేపథ్యంలో ఎట్టకేలకు న్యాయవ్యవస్థ ద్వారా వర్గీకరణ అంశం పరిష్కారం కావడం సంతోషదాయకం అన్నారు. సుప్రీంకోర్టులో చేసిన న్యాయ పోరాటంలో ముందు వరుసలో ఉన్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అలాగే మన రాష్ట్రంలో కుడా అమలే చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం సుప్రీంకోర్టు తీర్పుపై తన స్పందన తెలియజేయాలి లేని పక్షంలో ఆయన వర్గీకరణకు వ్యతిరేకమని మాదిగలంతా భావించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News