-రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ అంశం పునరావృతం కాకుండా ఉండేందుకై పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1982 ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును అనుసరించి గుజరాత్ రాష్ట్రంలో కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలను రూపొందించడం జరిగిందన్నారు. పేద వాడికి ఎటు వంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకై వాటి కంటే మరింత కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలతో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును ను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల ఎస్సైన్డు భూములను ఫ్రీ హోల్డుగా మార్చడమే కాకుండా దాదాపు 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు అంతా ప్రత్యేక దృష్టి సారించి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రుల వద్దకు వచ్చే విజ్ఞప్తుల్లో 80 శాతం పైగా రెవిన్యూకు సంబందించినవే అన్నారు. ప్రజల హక్కులను కాపాడే విధంగా రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని, అధికారుల అంతా చట్టానికి లోబడి పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నారన్నారు. గత పాలకులు చేసిన అరాచకాలు బయట పడకుండా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను ధగ్దం చేయడం జరిగిందన్నారు. మదనపల్లి వెళ్లిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు కుప్పలు తెప్పలుగా విజ్ఞాపనలు రావడమే గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలకు నిదర్శనం అన్నారు.
గత ముఖ్యమంత్రి ఫొటోల పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పాస్ పుస్తకాలపై తమ పొటోలను ముద్రించుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన రీ-సర్వేను కొనసాగించినా, నిలుపుదల చేసినా సమస్యలు ఎన్నో ఎదురవుతున్నాయని, ఈ విషయంలో గ్రామ సదస్సుల నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు జిల్లా కలెక్టర్లు అంతా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో 77 లక్షల సరిహద్దుల రాళ్లు ఉన్నాయని, వాటిని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆయన కోరారు.
గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా పనిచేయడమే కాకుండా వారి పాలనలో ఒకే ఒక సారి ప్రజావేదిలో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి, మరుసటి రోజు ఆ వేదికనే కూల్చేసిన ఆ ప్రభుత్వం యొక్క సైకో స్వభావాన్ని ప్రజలు గ్రహించారే గానీ అధికారుల్లో కొందరు గ్రహించలేకపోయారన్నారు. గత ముఖ్యమంత్రి వ్యవస్థను కూల్చేందుకు ప్రయత్నించాడు కాబట్టే ఆ వ్యవస్థలే అతన్ని మింగేశాయన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తదుపరి తొలిసారిగా జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న సమావేశం ఇదని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పొప్పులను అన్నింటినీ సమీక్షించి రాబోయే రోజుల్లో ఒక ప్రజాహితమైన పరిపాలన అందజేసేందుకు అవసరమైన దిశానిర్థేశాన్ని చేసేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుచున్నదన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పించే విధంగా మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, సామాజిక భద్రతా ఫించన్లు పెంపు మరియు స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సంతకాలు చేసి పలు వర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరెవేర్చే విదంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఫించన్ల పంపిణీ విషయంలో కలెక్టర్లు అద్బుతంగా పనిచేసి ఒకటవ తేదీనే 97 శాతం పింఛన్లను అందజేయడం జరిగిందని అభినందించారు. జిల్లా పరిపాలనా వ్యవహరాల్లో జిల్లా కలెక్టర్లు పట్టుకొమ్మలని, ప్రభుత్వ ఆలోచనా విధానాలను ప్రతిభింబిచే విధంగా క్షేత స్థాయిలో కలెక్టర్లు పనితీరు ఉండాలన్నారు.
అపార పరిపాలనా అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు మానవతా దృక్పధం ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో గాడిపెట్టాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు అంతా శక్తి వంచన లేకుండా కృషిచేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్దికి, నిరుపేదల సంక్షేమానికి, అభ్యున్నతికి సహరించాలని ఆయన కోరారు.