-పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు మరియు వారి సిబ్బందితో కలిసి పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ నేరాలను అరికట్టి ప్రజలందరిని సైబర్ సిటిజన్స్ గా తయారు చేయాలనే లక్ష్యంతో బృహత్తర ప్రణాలికను సిద్ధం చేయడం జరిగింది. దీనిలో బాగంగా ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు కమీషనరేట్ పరిదిలోని అన్ని బ్యాంకుల అధికారులతో పోలీస్ కమీషనర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…. ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ నేరాలపై ప్రజలలోభారీ ఎత్తున అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు పోవడానికి ఈ సైబర్ కమాండోలను ఏర్పాటు చేసినట్లు, ఇప్పటికే కమీషనరేట్ పరిదిలో అన్ని కళాశాలలో విద్యార్ధినీ విద్యార్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగిన వారిని సైబర్ సోల్జర్స్ గా నమోదు చేసుకోవడం జరిగిందని, వారు వారి ఏరియాలోని ప్రజలకు సైబర్ నేరాలు ఏవిధంగా జరుగుతాయి, సైబర్ నేరానికి గురికాకుండా ఉండాలంటే ఏ ఏ జాగత్ర్తలు తీసుకోవాలి? నేరం జరిగిన పక్షంలో ఏ విధంగా 1930 కు ఫిర్యాదు చెయ్యాలి? ఫిర్యాదు సమయంలో దర్యాప్తు అధికారులకి సమర్పించాల్సిన ఆధారాలు ఏమిటి వాటిని ఎలా సేకరించాలి? మొదలగు విషయాలపై ప్రజలను చైతన్య పరిచి వారిని సైబర్ సిటిజన్స్ గా మార్చడం చేస్తారని, అంతేకాకుండా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నగరంలో చాలా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరిగుతుందని, విడియో కాంటెస్ట్ పెట్టడం జరిగిందని దీనిలో బాగంగా బ్యాంకర్స్ యొక్క సహకారం అవసరం అని, సైబర్ నేరాల నివారణలో బాగంగా త్వరితగతిన విచారణ చేపట్టడం జరుగుతుందని, ఈ క్రమంలో ఏమైనా సలహాలు ఉంటే తెలియజేయమని, ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు అందరూ బాగస్వాములు కావాలని కోరారు.
అదేవిధంగా ఎవరైనా భాదితులు మీ వద్దకు వచ్చి తన ఎకౌంటు లో తనకు తెలియకుండా డబ్బులు పోయినాయని బ్యాంకుకు వచ్చి చెప్పినప్పుడు వారి డబ్బులు ఏ ఎకౌంటు కు వెళ్ళినాయో వారికి తెలియజేయాలని, మెయిల్ ద్వారా ఏదైనా ఎకౌంటు ఫ్రీజ్ చేసినప్పుడు ఆ డబ్బును వెంటనే రిలీజ్ చేసిన భాదితుడు మరియు దర్యాప్తు అధికారులు చాలా ఆనందంగా ఉంటారని, చాలా మంది లక్షలలో మోసపోతున్నారని, వారిపట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని మరియు వారికి తగిన సలహాలను అందించి పోలీస్ వారికి దర్యాప్తులో సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తోపాటు, డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్., సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు, నగరంలోని అన్ని బ్యాంకుల నుండి అధికారులు పాల్గొన్నారు.