-రెండు వారాల్లో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయాలి
-కార్పొరేషన్ కమిషనర్ తో పెమ్మసాని
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
‘నగరాభివృద్ధిపై పూర్తి దృష్టి సారించాలి. రోడ్ల ప్యాచ్ వర్క్ లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. కార్పొరేషన్ పై ఉన్న వ్యయభారం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.’ అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
గుంటూరులోని స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసాని ని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా నగరంలోని పలు సమస్యలను ఇరువురు చర్చించారు. రోడ్ల ప్యాచ్ వర్క్ లు, పారిశుద్ధ్య సమస్యలతో పాటు రెవెన్యూ వసూళ్లకు ఎదురవుతున్న ఇబ్బందుల పై పలు వివరాలను పెమ్మసాని గారికి కమిషనర్ ఈ సందర్భంగా అందించారు. కార్పొరేషన్ పై పడుతున్న రెవెన్యూ భారాన్ని తగ్గించి, జిఎంసి కి రావాల్సిన ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని కమిషనర్ కు పెమ్మసాని సూచించారు. నగరాభివృద్ధి తో పాటు ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ వంటి పలు సుందరీకరణ కార్యక్రమాలను కూడా చేపట్టాలని రాబోయే 1-2 వారాల్లో పక్కా ప్రణాళికలను సిద్ధంగా చేయాలని ఆయన చెప్పారు. తద్వారా కార్పొరేషన్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించాలని పెమ్మసాని ఈ సందర్భంగా ఆదేశించారు.
కమిషనర్ మాట్లాడుతూ తాను ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశానని, రోజుల వ్యవధిలోనే ఆ ప్రణాళికలను అమలుపరిచి నగరాభివృద్ధికి సహకరిస్తానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కి వివరించారు.