విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్ధిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం అవసరమని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జాతీయ స్దిరాస్తి అభివృద్ది మండలి (నెరెడ్కో) సెంట్రల్ జోన్ నేతృత్వంలో స్ధిరాస్తి రంగ ప్రముఖులు, అమాత్యులు, పార్లమెంటు, శాసన సభ్యులతో బుధవారం నగరంలోని ఎన్ఎసి కళ్యాణ మండపంలో అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విజన్‌ను సాధించే క్రమంలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల పెంపు, స్థిరమైన వృద్ధి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పలు విధాన సంస్కరణలు చేపడుతుందన్నారు. పారదర్శకతో విధానాలు అమలు చేస్తూనే ప్రభుత్వపరమైన ప్రక్రియలను సులభతరం చేయటం తమ ధ్యేయమన్నారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సరసమైన ధరలకు గృహాలను అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రీన్ బిల్డింగ్ విధానాలు, సౌర శక్తి అధారిత విద్యుత్త్ ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణతో సహా స్ధిరాస్తి రంగ స్థిరమైన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందడుగు వేస్తుందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవటం ద్వారా స్ధిరాస్తి రంగం ముందడుగు వేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు. నగరాల మధ్య మెరుగైన అనుసంధానంతో రియల్ ఎస్టేట్ వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. విజయవాడ తూర్సు శాసనసభ్యుడు గద్దె రామమోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా స్థిరమైన పద్ధతులను అనుసరిస్తూ స్ధిరాస్తి రంగం ముందడుగు వేయాలన్నారు. విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రియల్ పరిశ్రమపై అధారపడి వేలాది అనుబంధ రంగాలు మనుగడ సాగిస్తున్నాయన్నారు. తగిన చొరవతో ప్రయత్నిస్తే టైర్-2, టైర్-3 నగరాల్లో సైతం రియల్ రంగం వృద్ధికి అవకాశాలున్నాయన్నారు. పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ మాట్లాడుతూ పెట్టుబడి ఆకర్షణను పెంచేలా రోడ్లు, ప్రజా రవాణా, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులపై మరింత చర్చ జరగాలన్నారు. గన్నవరం ఎంఎల్ఎ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్ధ పునరుద్ధరణలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర అత్యంత కీలకమైందని, గత పాలకులు దీనిని విస్మరించారన్నారు.
జాతీయ స్దిరాస్తి అభివృద్ది మండలి (నెరెడ్కో) రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరించుకుని, అవకాశాలను అందిపుచ్చుకోవటంలో నారెడ్కో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారం అవసరమన్నారు. ప్రభుత్వ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులలో నారెడ్కో సభ్యులకు క్రియాశీల భాగస్వామ్యం కల్పించాలన్నారు. నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ మాట్లాడుతూ సంపన్నమైన, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రభుత్వం, నారెడ్కోల భాగస్వామ్యం విశ్వాసం అవసరమన్నారు. భూసేకరణ, నిబంధనలు, వనరుల సేకరణ వంటి అంశాలలో రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా అమాత్యులు, పార్లమెంటు, శాసన సభ్యులను నారెడ్కో ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ సమావేశంలో శాసనసభ్యులు గల్లా మాధవి, భాష్యం ప్రవీణ్, నారెడ్కో రాష్ట్ర కార్య నిర్వాహణ ఉపాధ్యక్షుడు పరుచూరి కిరణ్, సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి కెవి రమణ, కోశాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.