-ప్రమాదంపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం
-బాధితుల పరామర్శకు రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను వినియోగించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంపై ఉన్నత స్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణ ఆధారంగా…ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.