Breaking News

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అర్హులైన పేదలందరికీ పింఛను అందించి ఆదుకోవడమే లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొలు రవీంద్ర అన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం నగరంలోని 20 వ వార్డు గిలకలదిండిలో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఒకవైపున జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ మంత్రివర్యులు పింఛన్లు పంపిణీ చేయడం చెప్పుకోదగ్గ విశేషం.

తొలుత మంత్రి గిలకలదిండిలో మంచానికి పక్షవాతంతో మంచానికే పరిమితమైన లంకే పోతురాజు ఇంటి కి స్వయంగా వెళ్లి అతనిని, అతని భార్య లక్ష్మీ దేవమ్మను ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి 15 వేల రూపాయల పింఛన్ను పోతురాజుకు మంత్రి అందజేశారు. గిలకలదిండి తుఫాన్ షెల్టర్ లో ఉన్న పింఛను లబ్ధిదారులు, ప్రజలతో మంత్రి మమేకమై అందరూ బాగున్నారా అని పలకరించి, వారి యోగక్షేమాలను, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెంచిన పించన్తో చాలా సంతోషంగా ఉన్నామని పలువురు పింఛన్దారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడ దివ్యాంగులు లంకే సాయి ప్రకాష్ కు 6000 రూపాయలు, వృద్ధులైన చిట్టా వీరబాబుకు 4000 రూపాయలు, తమ్ము పద్మకు 4000 రూపాయలు, మోకా గంగాదేవికి 4000 రూపాయల నగదును మంత్రి అందజేశారు. పింఛను ఎవరు ఇస్తున్నారు అని లబ్ధిదారులను మంత్రి వివరాలు అడగడంతో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారని ఆనందంతో చెప్పారు.

ఈ సందర్భంగా చింతా లక్ష్మి అనే మహిళ తన భర్త వీర్రాజు గత 4 సంవత్సరాలుగా ఆరోగ్యం బాగాలేక మంచం మీదే ఉన్నారని, 15 వేల రూపాయల పింఛను అందజేయాలని మంత్రిని కోరడంతో మంత్రి వెంటనే స్పందిస్తూ వారికి తప్పకుండా పింఛను వచ్చేలాగున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ పేదవారు, కల్లు గీత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంలో ఆనాడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 రూపాయల పింఛన్లు ప్రారంభించారన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 75 రూపాయలు చేశారని ఆ తదుపరి 200 రూపాయలు ఉన్న పింఛన్లను 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు మరల 2000 రూపాయలు చేశారన్నారు.

గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఆ పింఛన్లు 3 వేల రూపాయలకు పెంచిందన్నారు. తమ ప్రభుత్వం మరల అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం 3 వేల రూపాయల పింఛన్ను 4 వేల రూపాయలకు పెంచుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1000 రూపాయలు చొప్పున మూడు నెలలకు 3000 రూపాయలు కలిపి మొత్తం 7 వేల రూపాయలను జూలై 1 వ తేదీన పింఛనుగా అందజేశామన్నారు. అప్పటినుండి ప్రతినెల క్రమంతప్పకుండా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

సెప్టెంబరు నెల 1 వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో పింఛనుదారులు ఎదురుచూస్తూ ఉంటారనే ఉద్దేశంతో ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టకుండా ముందు రోజునే అంటే ఆగస్టు 31వ తేదీనే శనివారం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి దక్కుతుందన్నారు. పేదవారిపట్ల వారికి ఉన్న బాధ్యతకు ఇదే నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వం 10 వ తేదీ వరకు పింఛన్లు ఇచ్చిన సందర్భాలు మనం చూసామన్నారు. ఆగస్టు 31 వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులకు ఉద్యోగులు కూడా సహకరిస్తూ ఎంతో ఉత్సాహంతో పని చేస్తూ వర్షం సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10:30 గంటలకే 74 శాతం పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా 68 శాతం ఇప్పటివరకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సాయంత్రం లోపు నూటికి నూరు శాతం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

గన్నవరం మండలం కొత్తగూడెం గ్రామ సచివాలయ కార్యదర్శి కె. పావని 8 నెలల గర్భవతి అయినప్పటికీ పేదవారికి పింఛన్లు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం గమనిస్తే ఉద్యోగులు ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో గమనించాలన్నారు. ప్రభుత్వం పట్ల వారికి ఎంతో నమ్మకము కలిగిందన్నారు. పింఛన్ల కోసం 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. దాదాపు 33 వేల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందన్నారు. మంచానికి పరిమితమైన ఒక వ్యక్తికి 15 వేల రూపాయలు, దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛను అందిస్తుంటే వారు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఒక డ్వాక్రా మహిళ బలగం గంగ తన భర్త చనిపోగా 4 వేల రూపాయల వితంతు పించను పొందుతూ తన ఇద్దరు పిల్లలను బాగా చదివించుకుంటూ ఉందన్నారు. గత ప్రభుత్వం అర్హులైన పేదలకు పింఛను రాకుండా తొలగించిందని వారి అభ్యర్థన పరిశీలించి తప్పకుండా వారికి పించను పునరుద్ధరించే బాధ్యతను తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతంలో మురికినీటి కాలువ సరిగా లేదని చాలా ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకుని రాగా మంత్రి వెంటనే స్పందిస్తూ ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వార్డు సచివాలయ కార్యదర్శులు అలియా భాష, నాగ కిరణ్, మిర్యాల సురేష్ ,చందన వెంకట సాంబశివరావు, హరీష్ కుమార్, సాంబశివరావు, పూర్ణచంద్రరావు, యోగానంద్, స్థానిక నాయకులు వైవిఆర్ పాండురంగారావు, బచ్చల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *