Breaking News

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు అందరూ వారి ప్రధాన కార్య స్థానాల్లో అందుబాటులో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు అందరూ కూడా వారి ప్రధాన కార్య స్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

కలెక్టరేట్లో 24 గంటలు పని చేసే విధంగా 08672 252572 ఫోన్ నెంబర్ తో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని ఎవరైనా సరే ప్రజలుగాని, ఇతరులు గాని వర్షాల వలన ఇబ్బందులు పడుతుంటే వెంటనే సంప్రదించాలన్నారు. ఎక్కడైనా వర్షాలకు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయి ఉంటే గమనించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలైన పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన భోజనము మంచినీరు తదితర సదుపాయాలను కల్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు గాలికి పడిపోయి ఉంటే వాటిని గుర్తించి వెంటనే పునరుద్ధరించడం గాని, విద్యుత్ సరఫరా ఆపివేయడం గానీ చేయాలని లేనిపక్షంలో ప్రజలు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు.

విద్యుత్ సరఫరా అందుబాటులో ఉన్నప్పుడే మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు నూటికి నూరు శాతం భర్తీ చేసుకొని నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాలన్నారు. అన్ని విద్యాసంస్థలకు సెలవు రోజుగా ప్రకటించామని విద్యార్థులందరూ కూడా ఇంటి వద్దనే సురక్షితంగా ఉండేలా చూడాలన్నారు. మొబైల్ సెల్ టవర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా తగ్గిపోయే పక్షంలో జనరేటర్లను కావలసినంత ఇంధనంతో సహా సిద్దంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో ముఖ్యంగా మచిలీపట్నం నగరంలో ఎక్కడైనా వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆ నీటిని వెంటనే తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు, కృష్ణానది తీర ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసినన్ని మందులతో నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. అధికారులు సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేయాలన్నారు. ఎక్కడైనా రహదారులు దెబ్బతిని ఉంటే ప్రమాదాలు జరగకుండా, రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి శాఖకు సంబంధించిన విషయాలను క్షేత్రస్థాయి సిబ్బందితో అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు,మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *