Breaking News

నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన

-వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్న సిఎం
-భవానీపురం నుండి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటన
-వరద బాధిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి
-దాదాపు 22 కి.మీ మేర జేసీబీపైనే ప్రయాణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కన పెట్టి దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే చంద్రబాబు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వదర బాధితులకు అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగితెలుసుకున్నారు. వారి ఆవేదన, బాధను విని ధైర్యం చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెండు రోజులుగా బసచేస్తున్న సిఎం…మూడవ రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి భవానీపురం వెళ్లారు. ముందుగా అక్కడ బాధితులతో మాట్లాడారు. తమకు సాయం చేరిందని…ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో సాంత్వన చేకూరిందని ఆ ప్రాంత ప్రజలు చెప్పారు. సితార సెంటర్ నుంచి కార్లు వెళ్లలేని పరిస్థితుల్లో కాన్వాయ్ పక్కన పెట్టి జెసిబి ఎక్కి ముందుకు కదిలారు. దారి పొడవునా బాధితులతో మాట్లాడారు. అదే జేసీబీపై జక్కంపూడి వెళ్లి అక్కడ బాధితులను కలిసి ప్రజలకు అందుతున్న వరద సాయంపై తెలుసుకున్నారు. అక్కడి నుండి వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, నున్న, కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ కు వచ్చారు. అక్కడికి తన కాన్వాయ్ రావడంతో అక్కడి నుంచి కారు ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు సిఎం అన్ని ప్రాంతాల్లో జేసీబీపైనే ప్రయాణం చేశారు. పలు ప్రాంతాల్లో బాధితుల సమస్యలు విన్న సిఎం అధికారులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. సమన్వయం లోపం కారణంగా వేగంగా సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల్లో బాధ్యత, భయం తీసుకురావాలనే కారణంతోనే తాను స్వయంగా మూడు రోజులుగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీఎం తెలిపారు. అధికారులు బాధ్యత, మానవీయకోణంలో పనిచేయాలని సిఎం అన్నారు. సరిపడా ఆహార ప్యాకెట్లు పంపుతున్నా ఎందుకు చేరవేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. నీరు తగ్గని ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు.

సితార సెంటర్ లో బయలు దేరిన ముఖ్యమంత్రి మళ్లీ వెనక్కి వస్తారని అధికారులు కాన్వాయ్ ను అక్కడే ఉంచారు. అయితే సిఎం అక్కడి రాకపోగా ఏ ప్రాంతానికి వస్తారో తెలియకపోవడంతో కాన్వాయ్ ను పలు చోట్లకు తిప్పారు. ప్రతి ప్రాంతాన్ని చూడాలని, సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని సిఎం భావించారు. దీంతో అనేక ప్రాంతాల్లో నాలుగున్నర గంటల పాటు ఆయన పర్యటన జేసీబీపైనే సాగింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా సిఎం వరద బాధిత ప్రాంతాల్లోనే పర్యటించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు వదర ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. సితార సెంటర్ వద్ద వరద ప్రాంతంలో అడుగు పెట్టిన ముఖ్యమంత్రి పలు చోట్ల పర్యటించి రామవరప్పాడు వంతెన సమీపంలో సాధారణ ప్రాంతానికి చేరుకున్నారు. సిఎం అక్కడికి వచ్చే సరికి ఆయన కాన్వాయ్ కూడా ఆ ప్రాంతానికి రాలేదు. దీంతో మరికొంత దూరం అయన జేసీబీపైనే ముందుకు సాగారు. సిఎం రూట్ పై సమాచారం అందుకున్న కాన్వాయ్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ నుంచి తన వాహనంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ నాలుగున్నర గంటల పర్యటనలో ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. సిఎంతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పర్యటిచారు. వరద కారణంగా ఇతర వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో సిఎం సెక్యూరిటీలోని కొంత మంది సిబ్బంది మాత్రమే ముఖ్యమంత్రితో వెళ్లగలిగారు.

Check Also

13 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన 13 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *