Breaking News

డిసెంబర్ రెండో వారంలో సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన..

-పోలవరం నిర్మాణంపై అదే రోజు షెడ్యూల్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి..
-పోలవరం ఆర్ & ఆర్, భూసేకరణ బకాయిలు రూ.996 కోట్ల విడుదలకు ఆదేశాలు..
-ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా నదుల అనుసంధానం, వాటర్ పాలసీ..
-డిసెంబర్-జనవరిలో హంద్రీ-నీవా, చింతలపూడి, వెలిగొండ ప్రాజెక్టుల పనులు ప్రారంభం..
-రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి.. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం, ఇతర ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, వాటర్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ రివ్యూ చేపట్టడం జరిగిందన్నారు.

సీఎం పోలవరం పర్యటన:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలా, 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ రెండోవారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని, అదేరోజు పోలవరం నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక రోజు గానీ, ఒక గంట గానీ వృథా కాకూడదని సీఎం చెప్పారన్నారు. దీనిపై 10 రోజుల్లో మరింత క్లారిటీ తీసుకుని షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ 5 నెలల్లోనే రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి స్థాయి అవగాహనతో షెడ్యూల్ రిలీజ్ చేసే స్థాయికి చేరుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఒక్కొక్క సాంకేతిక సమస్యలను అధిగమిస్తామని, ఇప్పటికే ప్రాజెక్టుల డిజైన్లకు సూత్రప్రాయంగా అనుమతులు లభించాయన్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు సంబంధించిన రూ.996 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. పోలవరం విషయంలో అంతర్రాష్ట్ర సమస్యలకు సంబంధించి చత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలతో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని కచ్చితంగా పోలవరం ఫలాలు రాయలసీమ, ఉత్తరాంధ్రకు అందిస్తామన్నారు.

హంద్రీ-నీవా:

హంద్రీ-నీవా ప్రాజెక్టు రాయలసీమకు లైఫ్ లైన్ వంటిదన్నారు. అటువంటి ప్రాజెక్టు గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 కూడా కేటాయించలేదన్నారు. హంద్రీ-నీవాను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ నెలలో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. హంద్రీ-నీవా ప్రధాన కాల్వ విస్తరణ, లైనింగ్ పనులు మొదలుపెడతామన్నారు. డిసెంబర్-జనవరి నెలల్లో హంద్రీ-నీవా పనులు ప్రారంభిస్తామన్నారు.

చింతలపూడి:

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇరిగేషన్ విషయంలో రాష్ట్రం 50 ఏళ్ల అంధకారంలోకి నెట్టివేయడం జరిగిందన్నారు. 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించే బహుళార్థక ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ అన్నారు. అటువంటి చింతలపూడిపై గత పాలకులు కుట్రలు చేశారన్నారు. వారి పాలనలోనే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు రూ.73 కోట్ల పెనాల్టీ విధించారని గుర్తు చేశారు. 3 నెలల్లో అనుమతులు తీసుకోవాలని చెప్పినా, పట్టించుకోకపోవడంతో 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో చింతలపూడి ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసేశారన్నారు.

వెలిగొండ:

ప్రాజెక్టుల విషయంలో గత ఐదేళ్లూ పాలకులు మొద్దు నిద్రపోయారని, అవాస్తవాలు-అసత్యాలు వెల్లడించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితిని సమీక్షించడం జరిగిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే గత పాలకులు రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు. 2024 ఎన్నికల సమయంలో రైతులను కూడా దగ్గరకు రానీయకుండా ప్రాజెక్టును అంకితం చేస్తున్నామని అసత్య ప్రచారాలు చేశారన్నారు. 2026 జూన్ కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

వాటర్ పాలసీ:

తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా.. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా వాటర్ పాలసీ తీసుకురావడం జరుగుతోందన్నారు. ఇటీవల వర్షాలు, వరదలు వచ్చినప్పుడు 11 వేల టీఎంసీలు నీళ్లు రాష్ట్రానికి వచ్చినా వాటిలో 954 టీఎంసీలు మాత్రమే వాడుకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలన్నా లక్ష్యంతో.. వరదలొచ్చినా, కరువు కాటకాలొచ్చినా రాష్ట్రాన్ని కాపాడాలన్న ముందుచూపుతో వాటర్ పాలసీ తీసుకురావడం జరుగుతోందన్నారు. అదే వాటర్ మేనేజ్ మెంట్, అదే వాటర్ పాలసీ అని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.

నదుల అనుసంధానం:

ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా .. సవాళ్లెన్ని ఎదురైనా గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని గోదావరి – కృష్ణా – బనకచర్ల ప్రాజెక్టు ఇదొక గేమ్ ఛేంజర్ అని స్పష్టం చేశారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను మళ్లించి ప్రతి ఎకరాకూ సాగునీరందించాలంటే నదుల అనుసంధానం జరగాల్సిందేనన్నారు. రాష్ట్రం రూపు రేఖలు మార్చే నదుల అనుసంధానాన్ని 2-3 ఏజెన్సీలతో తక్కువ ఖర్చుతో చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *