Breaking News

తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్

-తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ఎంపీ డాక్టర్. మద్దిల గురుమూర్తి నేడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అధికారులు స్టేషన్ నిర్మాణ పనుల గూర్చి ఎంపీకి వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్టేషన్ నిర్మాణాల పురోగతి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల గురించి రైల్వే ఇంజనీరింగ్ విభాగం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా సంవత్సరానికి సుమారు 6 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని వారందరికీ అనుకూలంగా ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు సాధించామని గత ప్రభుత్వ హయాంలోనే పనులు మొదలయ్యాయని అన్నారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం తిరుపతి నగరానికి తలమానికం అని అన్నారు.

సిఆర్ఎస్ లెవెల్ క్రాసింగ్ 109 వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, లెవెల్ క్రాసింగ్ 108 కాటన్ మిల్లు దగ్గర, లెవెల్ క్రాసింగ్ 107 హీరోహొండా షోరూం దగ్గర అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేబుల్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయని త్వరలో పూర్తి స్థాయిలో పనులు మొదలవుతాయని ఎంపీ తెలియజేసారు. వర్షాకాలం మొదలయిందని తిరుపతి పార్లమెంటు పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జిలలో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను కోరారు.

ఎంపీ నిధులు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిధులతో తిరుపతి బస్టాండ్ ఎదురుగ నిర్మించ తలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని ఎంపీ రైల్వే అధికారులను కోరారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఒక ప్రక్కన పనులు మొదలయ్యాయని, త్వరలో మరో వైపు పనులు మొదలెడుతామని వారు తెలియజేసారు.

రేణిగుంట సంత గేటు వద్ద కూడా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించనున్నారని తెలియజేసారు. అలాగే రేణిగుంట రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి నెం. 171 నుంచి 175 వరకు 1200 మీటర్ల పొడవున సరైన నీటి పారుదల సౌకర్యం లేదని వారికీ తెలియజేసారు. రైలు మార్గం పక్కనే ఉన్న కాలువలో పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నీరు నిలిచిపోతోందని వర్షాకాలంలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో ట్రాక్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అక్కడ సరైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ ఎంపీ కోరారు.

మొత్తం రూ.200 కోట్లతో రేణిగుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఈ పనులు నాలుగు దశలలో చేపడతారని మొదటి దశ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అవసరమైన అనుమతులు త్వరగా సాధించి పనులు మొదలెట్టాలని అనుమతుల విషయంలో ఏవైనా అవరోధాలు ఉన్నట్లయితే తన సహకారం తీసుకోవాలని అధికారులను కోరారు. దానితోపాటు గూడూరు తిరుపతి మూడవ రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయ్యిందని ఈ సందర్భంగా ఎంపీ తెలియజేసారు. పూడి, ఏర్పేడు రైల్వే లైన్ నిర్మాణం కోసం త్వరితగతిన భూసేకరణ చేయడం కోసం జిల్లా కలెక్టరుతో మాట్లాడుతానని తెలియజేసారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *