Breaking News

చల్లపల్లిలో “స్వచ్ఛతాహి సేవ”ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి బాలలే రేపటి పౌరులు, పరిశుభ్రత, ఆరోగ్యంపై బాల్యం నుండి అవగాహన కల్పించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. నేటి నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలు” సందర్భంగా జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం చల్లపల్లిలో జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద మొక్కలు నాటారు. జడ్పీ హైస్కూల్ వద్ద నుండి చల్లపల్లి సెంటర్ వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీకి కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

పచ్చని చెట్లు- ప్రగతికి మెట్లు, చెట్లను పెంచు- ఆరోగ్యాన్ని పంచు, చెత్త నుండి సంపద- చేద్దాం రండి ముందర, పర్యావరణాన్ని పరిరక్షించండి- భావితరాలను కాపాడండి, సాగునీటి వనరుల శుభ్రత- మన ఆరోగ్యానికి ఎంతో భద్రత, ప్లాస్టిక్ వాడకం నిషేధిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేస్తూ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చల్లపల్లి సెంటర్లో మానవహారంగా ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ విద్యార్థులచే, అధికారులు, సిబ్బందిచేత “..నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను..” అంటూ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల అవగాహన, తగిన ప్రచారం కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా నేటి నుండి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతహి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా చెత్త పోగయ్యే ప్రదేశాలు (బ్లాక్ స్పాట్స్) గుర్తించి వాటిని తొలగించి శుభ్రం చేయడం, తద్వారా చెత్త శాతం తగ్గించేందుకు, పరిసరాల పరిశుభ్రత పర్యావరణం కాపాడేందుకు పలు కార్యక్రమాలతో పాటు, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా చల్లపల్లిని స్వచ్ఛ సుందరంగా తీర్చిదిద్దిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ, స్వచ్ఛ సుందర చల్లపల్లి స్ఫూర్తిగా జిల్లాలో అన్ని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.

అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున గాంధీ గారు ధరించిన కళ్ళజోడు గుర్తుగా స్వచ్ఛభారత్ దేశంలో తొలుత ప్రారంభించారన్నారు. దీనిని స్ఫూర్తిగా స్వచ్ఛంద్రప్రదేశ్ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా ఈ రోజు నుండి స్వచ్ఛతాహి సేవ జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తిగా చల్లపల్లి స్వచ్ఛ సైనికులు నిరంతరం శ్రమచేసి స్వచ్ఛ సుందర చల్లపల్లికి దేశంలోనే ప్రత్యేక స్థానం లభించేలా కృషి చేశారని, ఈ కారణంతో చల్లపల్లికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. చెట్లను నరికితే అనర్థమే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రభావం మనం ఎదుర్కొంటున్నామన్నారు. వాల్టా చట్టం సరిగా అమలు చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ విషయాలన్నింటిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చల్లపల్లి ఆదర్శంగా అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.

ఈ కార్యక్రమం పై పలువురు అభిప్రాయాలు
1. పైడి పాముల కృష్ణకుమారి, సర్పంచి, చల్లపల్లి గ్రామం
గత 11 సంవత్సరాలుగా గ్రామంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
రాత్రిపూట గ్రామపంచాయతీ ఏదైనా పని చేస్తుందంటే అది ఒక్క చల్లపల్లిలోనే అని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు.
పంచాయితీ, పాలకవర్గ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
నిరంతరం గ్రామ వార్డులు, బజార్ లోనే ఉంటూ పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామన్నారు.
ప్రజలకు కావలసిన మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు తదితర మౌలిక సదుపాయాలను కల్పించి గ్రామం ముందడుగు వేస్తున్నదన్నారు.
తాను సర్పంచ్ గా, వార్డు సభ్యురాలుగా, జడ్పిటిసి సభ్యురాలుగా గ్రామ పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు.
గ్రామం నాలుగు పక్కల మరుగుదొడ్లు నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.
పారిశుద్ధ కార్మికులు ఒకవైపు పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ మరోవైపు మొక్కలకు నీరు పోస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారన్నారు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి సంస్థలో 250 మంది కార్యకర్తలు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు స్వచ్ఛత కార్యక్రమాలలో శ్రమిస్తూ ఉండడం గొప్ప విషయం అన్నారు.

2.ఉదయ్ శంకర శాస్త్రి, చల్లపల్లి గ్రామం
అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్, డాక్టర్ బి.ఆర్.కె ప్రసాద్ పద్మావతి ల సహకారంతో గత 10 సంవత్సరాలుగా స్వచ్ఛ సుందర చల్లపల్లి పేరుతో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అందులో తాను కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు.
రోజు 100 మందికి పైగా పనిచేస్తున్నామని, మురికి కాలువలు తోపాటు ఊరంతా శుభ్రం చేస్తున్నామన్నారు. గ్రామంలో దాదాపు 30 వేల మొక్కలు నాటామన్నారు. ప్రస్తుతం జాతీయ రహదారిలో 2.5 కిలోమీటర్ల మేరకు రెండు వైపులా పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు.
తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రతిరోజు రెండు గంటల చొప్పున వీధులన్నీ శుభ్రపరుస్తూ శ్రమదానం చేస్తున్నామన్నారు.
ప్రతి సంవత్సరం ఈ సమయంలో స్వచ్ఛత కార్యక్రమాలు జరుగుతున్నాయని అలా కాకుండా రెండు నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందన్నారు.
ప్రధాన వీధుల్లో తిరిగితే చాలదని వీధి వీధి కూడా తిరిగి ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
చల్లపల్లి చుట్టుపక్కల 40 గ్రామాలకు కేంద్రంగా ఉందని అక్కడి ప్రజలు చల్లపల్లి కి వచ్చి ప్రధాన రహదారుల్లో చెత్త వేస్తున్నారని పోలీసులు, పంచాయతీ వారు సంయుక్తంగా శ్రద్ధ తీసుకొని బయట నుంచి వచ్చే ప్రజలకు కూడా పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించేలా చూడాలన్నారు.
స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని భావిస్తున్నానన్నారు.

3. కోట పద్మావతి, చల్లపల్లి గ్రామం
తాను ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నానని, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నానన్నారు. ప్రతిరోజు ఉదయం 4-30 గంటల నుండి 6-30 గంటల వరకు చల్లపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నానన్నారు.
ఇలాంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామంలో ఉంటే బాగుంటుందన్నారు. డాక్టర్ డి ఆర్ కె ప్రసాదు, పద్మావతిల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా దిగ్విజయంగా చేస్తున్నామన్నారు.
ప్రతి గృహస్తుడు, పౌరుడు బాధ్యతగా తీసుకొని స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందన్నారు.
సంస్థ కార్యకర్తలు తమ ఇంటి వద్దకు వచ్చి పనిచేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు కూడా అందులో పాలుపంచుకోవాలన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ నాగేశ్వర నాయక్, జెడ్పిసిఈఓ ఆనందకుమార్, ఎంపీపీ కోట విజయరాధిక, జడ్పిటిసి రాజులపాటి కళ్యాణి, చల్లపల్లి సర్పంచ్ పైడి పాముల కృష్ణకుమారి, డాక్టర్ డి ఆర్ కె ప్రసాద్, ఎంపీడీవో సిహెచ్ చినరాట్నాలు, తాసిల్దారు వనజాక్షి, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *