-దేశంలో ఎక్కడాలేని విధంగా బాధితులకు అత్యధిక ఆర్థిక సాయం
-వరద బాధితులకు రూ.602 కోట్ల పరిహారం పంపిణీ
-బాధితులకు మనోధైర్యం కల్పించాం
-అత్యంత పారద్శకంగా నష్ట గణన
-సీఎంఆర్ ఎఫ్‌కు రికార్డు స్థాయిలో రూ.400 కోట్ల విరాళాలు
-దాతలందరికీ పాదాభివందనం చేస్తున్నా
-బాధితులకు సాయం అందించడంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం
-శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే సహించేది లేదు
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి
-వరద బాధితులకు విజయవాడ కలెక్టరేరట్ లో పరిహారం పంపిణీ చేసిన ముఖ్యమంత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేవలం పక్షం రోజుల్లోనే నష్ట పరిహార సాయం అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బుధవారం విజయడలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వరదబాధితులకు పరిహార పంపిణీ కార్యక్రమం జరిగింది. వరద నష్ట పరిహార పంపిణీ చేసిన సమాచార లేఖలను అబ్దిదారులకు లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ బుడమేరు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుతో పాటు వరదల్లో నష్టపోయిన వారికి రూ.602 కోట్ల మేర నష్ట పరిహార సాయాన్ని బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని చెప్పారు. వదర బాధితులకు సాయం అందించడంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30వ తేదీ నాటికి వాటినిక కూడా పరిష్కరించి సాయం అందిస్తామని చెప్పారు. చిట్ట చివరి బాధితుడికీ సాయం అందే వరకు విశ్రమించబోమని వరద సహాయక చర్యలు చేపట్టినప్పుడే హామీ ఇచ్చానని ఆ మేరకు అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల జాబితా ఎంపిక చేసి ఆ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే…
వరదల నష్ట పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కలుపుకొని మొత్తం రూ. 7,600 కోట్ల మేర నష్టం వచ్చింది. నేనెప్పుడూ చూడనటువంటి విపత్తు ఇది. ఒక ప్రాంతంలో 42 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ నంతగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చింది. గత ప్రభుత్వం చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయి. గతంలో బుడమేరు ఆధునికీకరణకు రూ. 57 కోట్లు ఇస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, రాజకీయ వివక్షతో ఆ పనులను రద్దు చేసింది. 11.90 లక్షల క్యూసెక్కుల సామర్థ్యమున్న ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో ఒక్కసారిగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు గత పాలకుల నిర్లక్ష్యాలు రెండు కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది.
బాధితులకు మనోధైర్యమిచ్చాం
సింగునగర్‌లోని పరిస్థితిని చూసి కలెక్టరేట్‌లోనే మకాం వేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. అప్పటి పరిస్థితిని చూస్తే చాలా బాధేస్తుంది. సీఎస్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారులను వార్డుల్లో పెట్టి ప్రత్యక్షంగా సహాయక చర్యలను పర్యవేక్షించాం. వరద సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాక ఉ రూ.3 కోట్లు తక్షణ సాయం కింద నిధులిచ్చి ఆర్డర్ల కోసం నిరీక్షించకుండా ఖర్చుపెట్టమని ఆదేశాలిచ్చాం. కేంద్రంలో ఉన్న ప్రముఖులతో మాట్లాడి రాత్రికి రాత్రి ఆరు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను, 100 పవర్ బోట్లు, హెలికాప్టర్లు తెప్పించాం. 120 బోట్లు, 150 డ్రోన్లు కూడా ఉపయోగించాం. గండ్లు పూడ్చడంతో పాటు నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను కూడా తొలగించాం. ప్రమాదకర ప్రాంతాలకు అయితే నేను నాలుగైదుసార్లు వెళ్లాను. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తెప్పించుకొని అవసరమైన సహాయసహకారాలు అందించాం. బాధితులకు మనోధైర్యం కల్పించాం. డ్రోన్లు, ఫైర్ ఇంజిన్లు ఉపయోగించడం వంటి వినూత్న కార్యక్రమాలతో సహాయమందించాం. సహాయకచర్యల్లో వేలాది మంచి పనిచేశారు. కోటి 14 లక్షల నీటి బాటిళ్లు, 37 లక్షల లీటర్ల పాలు, 47 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 5 లక్షల గుడ్లు పంపిణీ చేశాం. కోటి 15 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశాం. 5000 క్వింటాళ్ల కూరగాయలను 2,45,000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ఫైర్ ఇంజిన్లను ఉపయోగించి దాదాపు 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రహదారులను, వీధులల్లోని బురదన శుభ్రం చేశాం. దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తరలించాం. భవిష్యత్తులో ఇలాంటి వరదలు ఏవైనా ఎదురైనప్పుడు ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విపత్తు నిర్వహణ కొత్త ఆవిష్కరణకు దారితీసింది.
రికార్డు స్థాయిలో రూ. 400 కోట్ల విరాళాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 400 కోట్ల విరాళాలు వచ్చాయి. దాతలు చూపిన చొరవ, వారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన తీరు స్ఫూర్తిదాయకం. వీల్‌ఛైర్‌లో సైతం వచ్చి విరాళాలు అందించారు. విపత్తు వచ్చినప్పుడు సాటివారికి సాయం చేయాలనే వారి తపన ఎంతో స్ఫూర్తినిచ్చింది. చిన్నపిల్లలు సైతం తాము దాచుకున్న సొమ్మును ఇచ్చారు. దాతలందరికీ పాదాభివందనం చేస్తున్నా. రూ. 7,600 కోట్ల మేర నష్టం వస్తే ఈరోజు ప్రభుత్వ సాయం కింద రూ. 602 కోట్లు విడుదల చేశాం. ఈ రూ. 602 కోట్లలో రూ. 400 కోట్లు దాతలే ఇచ్చారు. ఇది చరిత్రాత్మకం. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా హదుద్, తిత్లీ కంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం. 16 జిల్లాలపై భారీ వర్షాలు, వరద ముంపు ప్రభావం పడగా ఒకేసారి ఈ రోజు బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించాం. రాష్ట్రంలో 905 గ్రామాలు, 227 మండలాలు, 16 జిల్లాలపై వరదల ప్రభావం పడింది, వరదల్లో నష్టపోయిన నాలుగు లక్షల మందికి పరిహారం అందించాం. రాష్ట్రం మొత్తంమీద 74 మంది మరణించారు. విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్లు వచ్చిన వారికి రూ. 25 వేలు, ఒకటి, ఆపై అంతస్తుల్లో ఉన్నవారికి రూ. 10 వేల చొప్పున అందించాం. ఈ పరిహారం అందించడంలో చిన్నాపెద్దా అనే తేడా చూడలేదు.
ఎవరూ ఊహించని స్థాయిలో సేవలందించాం
గతంలో ఎన్నడూ కూడా పట్టణ ప్రాంతాల్లో విపత్తు ప్రభావిత బాధితులకు ఈ స్థాయిలో ఆర్థిక సహాయం అందలేదు. తూతూ మంత్రంగానే ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు నిబంధనావళిని మించి మరీ సాయం అందించాం. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ప్రభుత్వం పరంగా ఎన్ని విధాలా ఆదుకోవాలో అన్ని విధాలా ఆదుకుంటోంది. వినూత్న ప్రయోగాలతో సాయమందించాం. డ్రోన్లను ఉపయోగించి.. వరద నీటినిగానీ, ముంపు పరిస్థితినిగానీ అంచనా వేసి అవసరమైన సహాయసహకారాలు అందించగలిగాం. జిల్లా కలెక్టర్ సమర్థవంతంగా పనిచేయడంతో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. అర్బన్ కంపెనీ సహాయంతో మొత్తం 500 మందితో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ తదితర సేవలు అందించారు. ఇప్పటికే దాదాపు 5,900 విజ్ఞప్తులను పరిష్కరించాం. విడిభాగాలపై 50 శాతం, లేబర్ ఛార్జీలపై 100 శాతం రాయితీతో ఎలక్ట్రానిక్ గూడ్స్‌ను రిపేర్ చేయించాం. ఇలాంటి 5,068 విజ్ఞప్తులను పూర్తిచేశాం. ఇంకా 700 వరకు ఉన్నాయి. ఒకవేళ రిపేర్ చేయకపోతే జాప్యం జరిగితే వాటిని మీరు తీసుకొని.. కొత్తవి ఇవ్వమని కంపెనీల వారికి చెప్పాం. 14 వేల గ్యాస్ స్టవ్‌లను రిపేర్ చేయించాం. బీమా, బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాం. క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రక్రియను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తిచేయమని చెప్పాం. రుణాల రీషెడ్యూలింగ్‌తో పాటు రూ. 25 వేలు నుంచి రూ. 50 వేల వరకు వినియోగ రుణాలు అందించాలని చెప్పాం. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీలు, ఆధార్ కార్డులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాలు.. ఇలా ఏవిపోయినా వెంటనే ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ఎవరికైతే పాఠ్య పుస్తకాలు పోయాయో వారందరికీ ఉచితంగా పుస్తకాలివ్వమని చెప్పాం.
13 వేల అర్జీలనూ పరిష్కరిస్తాం
ఆర్థిక సాయానికి సంబంధించి గత రెండు రోజుల్లో 17 వేల అర్జీలు వచ్చాయి. వీటిలో 4 వేలు డూప్లికేషన్స్ పోగా 13 వేల వరకు దరఖాస్తులు ఉన్నాయి. వీటిని కూడా రెండురోజుల పాటు నిశితంగా పరిశీలిస్తాం. అర్హులైన వారికి తప్పనిసరిగా సాయమందిస్తాం. రానివారికి ఎందుకు రాలేదో చెప్తాం. సచివాలయాల్లో జాబితాలు కూడా ప్రదర్శిస్తాం. సహాయ కార్యక్రమాలను ఈ నెల 30నాటికి పూర్తిచేసి ఆరోజు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహిస్తాం. వరద బాధితులకు సహాయం అందించే యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేశాం. బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. చేసేపని పవిత్రంగా చేయాలి. లబ్ధిదారులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సాయమందిస్తోంది. జీరో కరెప్షన్, జీరో మ్యానిప్యులేషన్‌తో సహాయమందిస్తున్నాం. నాపై నమ్మకంతో దాతలెందరో ముందుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిలో వ్యవస్థలో ఎవరైనా ఒక్క రూపాయి తీసుకున్నారని తెలిస్తే వదిలిపెట్టను. గవర్నమెంట్‌లో ఉన్నవారైనా, ప్రైవేటులో ఉన్నవారైనా సరే జాతిద్రోహానికి పాల్పడే పనులు చేయొద్దు. ఒకవేళ చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టను. కౌలు రైతులకు, వాస్తవ సాగుదారులకు సాయాన్ని అందించాం. ఇళ్లలో అద్దెల్లో నివిసిస్తున్న వారు కూడా వరదల్లో నష్టపోయి ఉంటే వారికి కూడా సాయమందించాం. సవాల్ చేసి చెబుతున్నాం.. దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపోయిన రైతులకు సాయమందించాం. విధ్వంసాలు చేయడం.. వాటిని వేరేవారిపై నెట్టడం కొందరికి అలవాటుగా మారింది. ప్రజల ప్రాణాలు కాపాడటం, శాంతిభద్రతలు కాపాడటం వంటివి మా బాధ్యత. వీటికి ఎవరు విఘాతం సృష్టించినా, తప్పులు చేసినా సహించం.