-స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి
-అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలి
-గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలి
-గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు
-యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని… నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే….గత వైసీపీ ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిదని చంద్రబాబు నాయుడు అన్నారు. నాడు ప్రారంభమై కొంతమేర పూర్తి అయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని….క్రీడలు అంటే కేవలం పోటీల్లో పాల్గొనే వాళ్లకు సంబంధించిన విషయంగానే చూడవద్దని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వాళ్లు కూడా క్రీడల్లో భాగస్వాములు అయ్యేలా చేయాలన్నారు. గతంలో గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలు ఆడేవారని…ఇప్పుడు టీవీలు, ఇతర మాధ్యమాల కారణంగా ఆ సంస్కృతి పోయిందని సీఎం అన్నారు. మళ్లీ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే….ప్రజలు ఆటల వైపు మొగ్గుచూపుతారని సీఎం అన్నారు. కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలి అని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ పనులు చేయవచ్చని తెలిపారు. ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలు క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముందుకు వస్తే…వారి పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తద్వారా ఆయా గ్రామాల్లో క్రీడా వసతులుఏర్పాటు అవుతాయని సీఎం అన్నారు. ఆటల ద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుందని….ఐక్యత పెరుగుతుందని..ఇదొక మంచి సంస్కృతిగా నిలుస్తుందని సీఎం అన్నారు. 2027లో వచ్చే జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలన్నారు. 2017లో రూపొందించిన క్రీడా పాలసీ 2022లో ముగిసినా వైసీపీ ప్రభుత్వం కొత్త పాలసీ రూపకల్పనపై చొరవ చూపలేదని, నూతన క్రీడా పాలసీని రూపొందించాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల నిర్మాణంతో పాటు గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వాటిని మళ్లీ నిర్వహణలోకి తీసుకురావాలని ఆదేశించారు. మెడల్స్ సాధనలో రాష్ట్రం వెనుకబడి ఉందని… ఈవిషయంలో ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. తిరుపతి, అమరావతి, వైజాగ్ ను క్రీడా హబ్ గా మార్చాల్సిన అవసరం ఉందని, ఈ మూడు ప్రాంతాల్లో అన్ని క్రీడల నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన ప్రాజెక్ట్ గాంఢీవ, ప్రాజెక్ట్ పాంచజన్య, ప్రాజెక్ట్ విజయ, డే బోర్డర్స్, స్పోర్ట్స్ నర్సరీస్ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించాలన్నారు. అన్ని స్టేడియాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో క్రీడా అకాడమీల ఏర్పాటుకు స్థలాలు పొందిన వారితో సంప్రదిపుంలు జరిపి వెంటనే వాటి ఏర్పాటు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. వారు ఆసక్తి చూపకపోతే కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలన్నారు. క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మాణం చేపడతాం అన్నారు. రాష్ట్ర సచివాలయంతో పాటు….ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చిన్న పాటి స్పొర్ట్స్ సెంటర్ లు ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో విధుల అనంతరం అధికారులు, ఉద్యోగులు కొద్దిసేపు ఆటలు ఆడుకునే అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంతమేర కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్పోర్ట్స్ సెంటర్ లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ గ్రౌడ్స్, యూనివర్సటీ గ్రౌండ్స్, ప్రైవేట విద్యా సంస్ధల గ్రౌండ్స్ ను సామాన్య ప్రజలకు నిర్థేసిత సమయం వరకు అందుబాటులోకి తేవాలన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల ప్రజలు వ్యాయామం, ఆటలు ఆడుకునేందుకు అవకాశం కలుగుతుందని సీఎం అన్నారు. ఈ సమీక్షలో మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.