
-ఘనంగా నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు
-ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు, ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేలా కళాశాల సీనియర్ విద్యార్థులు ఆట పాటలతో సందడి చేసారు. తెలుగు, హిందీ, మలయాళం సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించారు. వేదిక పై ఉన్న విద్యార్థులే కాకూండా, వేదిక ముందు కూర్చొని వీక్షిస్తున్న విద్యార్థులు సైతం చిందేశారు. విద్యార్థుల చప్పట్లు, కేరింతలతో కళాక్షేత్రం ప్రాంగణం మారుమోగింది. సాంప్రదాయ, ఆధునిక, పాశ్చాత్య వస్త్రధారణలో విద్యార్థులు ప్రదర్శించిన ఫాషన్ షో ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా, లయబద్ధంగా ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన కృష్ణా విశ్వ విద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. చదువుతో పాటు సామజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. బుడమేరు వరద ముంపు సమయంలో నలంద విద్యార్థులు వరద బాధితులకు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనేక కళాశాలలు విద్యార్థుల భవిత కోసం, సమాజం కోసం పనిచేస్తున్నాయని అన్నారు. కళాశాల కరెస్పాండంట్ విజయ్ బాబు మాట్లాడుతూ నలంద డిగ్రీ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపుతుందనే ఉద్దేశంతో విద్యార్థులు తమ కళాశాలలో చేరడం జరిగిందన్నారు. వారి నమ్మకానికి పూర్తి నిదర్శనం, ఈ సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లేనని అన్నారు. మొదటి కౌన్సిలింగ్ లోనే 98 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సి2సి కరికులం అమలు చేయడం వల్ల, విద్యార్థులు తమ కెరీర్ ను సెట్ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో తమ కళాశాలలో చేరుతున్నారని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు వెల్కమ్ చెబుతూ సీనియర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన విద్యార్థులను అలరింపజేసి, కళాశాల సిస్టం, కళాశాల సాధించిన లక్ష్యాలను తెలియజేయడం జరిగిందన్నారు. అకాడెమిక్స్ లో టాపర్ లకు, వరద సహాయక చర్యల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్ లు అందజేశామన్నారు.
Prajavartha Online Telugu News