-మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో-2024 సందర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతకి ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలో మరిన్నీ ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో లు నిర్వహించాలి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, ఎమ్.ఎస్.ఎమ్.ఈ లను ప్రొత్సాహించటమే ముఖ్యఉద్దేశ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఆదివారం విజయవాడలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో-2024 సందర్శించారు. ఎంపి కేశినేని శివనాథ్ కి ఎక్స్ పో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే ఎక్స్ పో లో ఏర్పాటు చేసిన పలు ఫుడ్ బిజినెస్ స్టాల్స్ ను ప్రారంభించారు. స్టాల్స్ లోని ప్రొడక్ట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ ఎక్స్ పోను క్రియటర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఎపి హోటల్ అసోసియేషన్స్ , ఏపి కేటరర్స్ అసోసియేషన్స్ , ఎపి ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ , విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్ పో లు నిర్వహించాలని నిర్వహకులకి సూచించారు. ఇలా చేయటం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. ఇలాంటి ఎక్స్ పోల నిర్వహణ వల్ల కొత్త ఆవిష్కరణలు ప్రజలకు తెలియటానికి ఎంతగానో అవకాశం వుంటుందని, యువత ఫుడ్ బిజినెస్ లోకి రావటానికి ఆసక్తి చూపిస్తారన్నారు. హోటల్ నిర్వహణకు సంబంధించి మాత్రమే కాదు హోమ్ మేడ్ కుకింగ్ కి కూడా కావాల్సిన లెటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన కిచెన్ పరికారాలను పెద్ద, చిన్ని వ్యాపారస్తులు వినియోగించుకుని అభివృద్ధి బాటలో పయనించాలని ఆకాంక్షించారు. వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ కేశినేని శివ నాథ్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ యు.రేణుకాదేవి, పి.ఎస్. శివకుమార్, ఎపి హోటల్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ ఆర్.వి.స్వామి, ఏపి కేటరర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ వరదరాజులు, ఎపి ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వక్కల గడ్డ భాస్కరరావు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.