మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సమాజంలో యువత మద్యం, మాదక దవ్యాల బారిన పడి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారని, సమాజంలో ఇలాంటి రుగ్మతలు పోవాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి అరుణ సారిక అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి అలవాట్లు తెలుసుకోవాలని, వారి ప్రవర్తన గమనిస్తూ, వారిని గైడ్ చేయాలని ఆమె సూచించారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృష్ణాజిల్లా మరియు కృష్ణాజిల్లా పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా నల్సా (మాదకద్రవ్య బాధితులకు న్యాయ సేవలు మరియు మాదకద్రవ్యాల ముప్పు నిర్మూలన) పథకం 2015, నల్సా (వయోవృద్ధులకు న్యాయ సేవలు)పథకం 2016 అంశాలపై నిర్వహించిన “నూతన తరహా న్యాయ సేవల శిబిరం” శనివారం మొవ్వలో మండవ జానకి రామయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని డీఎల్ఎస్ఎ చైర్మన్, జిల్లా జడ్జి అరుణ సారిక, మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య, మొవ్వ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పి. రాజన్ ఉదయ్ ప్రకాష్ లతో కలసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
జిల్లా జడ్జి అరుణాసారిక ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు, ప్యానల్ లాయర్స్ తో ఈ కార్యక్రమం గురించి ముందుగా తెలియజేయడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలియజేసి, వాటి బారిన పడకుండా యువతను కాపాడటం ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలు వృద్ధుల సంక్షేమానికి అమలవుతున్న చట్టాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వీటితోపాటు ప్రభుత్వం వివిధ వర్గాలకు అమలయ్యే సంక్షేమ పథకాలు గురించి తెలియజేయడం వాటి లబ్ధి పొందేలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా డి ఎల్ ఎస్ ఏ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి కృష్ణ జిల్లా పరిధిలో 600 నుండి 700 వరకు కేసులు మాదకద్రవ్యాల సంబంధించినవే అన్నారు. కాలేజీ విద్యార్థులు ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని నెమ్మదిగా పాఠశాలలకు కూడా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంలో పిల్లల సంరక్షణ సరిగా లేక చెడు అలవాట్లకు లోనవుతున్నారని, సినిమాలు, స్నేహితుల ప్రభావం వల్ల ప్రేమ వ్యవహారాలకు మూలం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి భోజనం చేసి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి అలవాట్లు ప్రవర్తన గమనిస్తూ వారిని గైడ్ చేయాలని సూచించారు.
మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ ఇటీవల మాదక ద్రవ్యాల కేసులు చాలా వస్తున్నాయని, సమాజంలో మార్పు గ్రామాల నుండి మొదలుకావాలని, చట్టాల పట్ల మరింత అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో పరివర్తన రావాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ న్యాయస్థానాల్లో మన వివాదాలు సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అవగాహన కోసం న్యాయ సేవ శిబిరాలు దోహదం చేస్తాయన్నారు. మధ్యవర్తిత్వంతో లోక్అదాలత్ ల ద్వారా పరిష్కారమైన కేసుల్లో అప్పిలు ఉండదని, శాశ్వత పరిష్కారం పొందవచ్చుని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద రక్షణ పొందవచ్చు అన్నారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్పరిణామాల గురించి వివరించారు. గత జులై 1 నుండి అమలులోకి వచ్చిన కొత్త చట్టాలలో మహిళల పరిరక్షణ అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.
డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె.వి. రామ కృష్ణయ్య జిల్లాలో ఇప్పటివరకు 6 నూతన తరహా న్యాయ సేవలు శిబిరాలు నిర్వహించి వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు 232 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలు పంపిణీ, లబ్ధి చేకూర్చినట్లు, సత్వర న్యాయం కోసం నిర్వహించిన లోక్ అదాలత్తుల ద్వారా 1,00,442 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.
మొవ్వ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.రాజన్ ఉదయ్ ప్రకాష్ వయోవృద్ధులకు న్యాయ సేవలు వివరించారు.
దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు వయోవృద్దుల సంక్షేమ చట్టాలు వివరించారు.
అదనపు డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎ వెంకట్రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి దూర్జటి, చెన్నుపాటి కీర్తి(వాసవ్య మహిళా మండలి), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మౌనిష తదితరులు బాల్య వివాహాలు- వాటి పర్యవసానం, వయోవృద్ధుల సమస్యలు వారి సంక్షేమం గురించి మాదకద్రవ్యాల దుష్పరిణామాల గురించి ఈ సమావేశంలో అవగాహన కల్పించారు.
వివిధ సంక్షేమ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. ఐసిడిఎస్ ద్వారా గర్భవతులకు సీమంతం జరిపించారు.
పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ అందజేశారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగులకు వినికిడి పరికరాలు, విద్యార్థులకు లాప్ టాప్ లు అందజేశారు.
డిఎల్ఎస్ఎ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి పార్టిసిపెంట్స్ పేర్లు నమోదు చేసుకుని, బాలలు, మహిళలు, వృద్ధులు రక్షణకై న్యాయ సేవలు గురించిన అవగాహనకోసం కరపత్రాలు పంపిణీ చేశారు.
పోలీస్ శాఖ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్, ఉమెన్ పోలీస్ స్టేషన్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సేవల పట్ల అవగాహన కల్పించారు.
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలు, అగ్నిమాపక శాఖ, డి ఆర్ డి ఏ, సమగ్ర శిక్ష, ఐసిడిఎస్, స్వచ్ఛతాహి సేవ, ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బిపి, షుగర్ పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం క్రింద రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి విద్యుత్తు బిల్లు తగ్గించుకోండి అంటూ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కరపత్రాలతో ప్రచారం చేశారు.
మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు మత్తు పదార్థాల వల్ల దుష్పరిణామాల పట్ల అవగాహనకై చేసిన స్కిట్ ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డిఓ షారోన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవో జె విమాదేవి, తాసిల్దారు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News