Breaking News

కూటమి ప్రభుత్వంలో గుడులకు, గోవులకు రక్షణ లేకుండా పోయింది

-గోశాల కూల్చివేతపై మల్లాది విష్ణు ఆగ్రహం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మధురానగర్ యు.వి.నరసరాజురోడ్డులో వీఎంసీ అధికారులు కూల్చివేసిన గోశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తెల్లవారుజామున ఎవరు లేని సమయంలో దౌర్జన్యంగా గోశాలను కూల్చివేయడం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. వీఎంసీ, ఇరిగేషన్ అధికారుల నిర్వాకానికి ఆవులన్ని గాయపడ్డాయని.. ఆకలితో మండుటెండలో అలమటిస్తున్నాయని మండిపడ్డారు. గోమాత సకల దేవతా స్వరూపమని.. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమ‌న్నారు. అటువంటి గోవులను రోడ్డున పడేసి.. ఈ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. ప్రక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్ర జంతువుగా గుర్తించి కాపాడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం గోవులకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. గోశాలతో పాటు దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను సైతం దౌర్జన్యంగా కూలగొట్టారని ఆరోపించారు. పండుగల నేపథ్యంలో అమ్మవారిని పూజించేందుకు భక్తులు పెద్దఎత్తున వస్తుంటారని.. ఇటువంటి సమయంలో ఆలయాలను కూల్చివేయడం ఏమిటని ధ్వజమెత్తారు. కాల్వగట్టును పరిరక్షించడానికి గత వైసీపీ ప్రభుత్వంలోనే ప్రణాళికలు సిద్ధంచేసి.. ఫెన్సింగ్ పనులు ప్రారంభించడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. పత్రికలలో కథనాలు వస్తే తప్ప స్పందించని పరిస్థితి నెలకొందన్నారు. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే భక్తులు ఇబ్బందులు పడుండేవారు కాదని చెప్పారు. కృష్ణా పుష్కరాల సమయంలోనూ నగరంలో 23 దేవాలయాలను కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుదని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని పునర్నిర్మించడం జరిగిందని గుర్తుచేశారు. మరలా కూటమి ప్రభుత్వంలో అటువంటి దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మమంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బీజేపీ.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే గోవులకు రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని.. లేనిపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, నాయకులు ఎస్.కె.బాబు, అక్బర్, కంభం కొండలరావు, జాక్సన్, ఎస్.కె.నాగుర్ వలి, నాగమణి, కరుణ, బోనం నాగు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవి తరగతి సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *