– జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డా. నిధిమీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో జిల్లాలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) ప్రక్రియ సజావుగా జరిగేందుకు పూర్తిస్థాయిలో సిద్దంకావాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ నిధి మీనా.. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు తదితరులతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నైపుణ్య గణన సర్వే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని.. సిబ్బందిని సమాయత్తం చేయాలని సూచించారు. మంగళవారం ఒక్కో మండలం నుంచి ఇద్దరు చొప్పున సచివాలయ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ల ద్వారా క్షేత్రస్థాయిలో సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. సర్వేలో ప్రధానంగా విద్యార్హతలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు, ప్రస్తుత ఉపాధి వివరాలు, నైపుణ్యాలు, ఆకాంక్షలు తదితర 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించాల్సి ఉంటుందన్నారు.
ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అక్టోబర్ 31 సెలవుదినం కావడంతో 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసి.. నవంబర్ 1, 2 తేదీల్లో పెన్షన్ పంపిణీని పూర్తిచేయాలని సూచించారు. 2,33,248 మంది పెన్షన్‌దారులకు రూ. 99.45 కోట్ల మేర పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. నవంబర్ 1వ తేదీ ఉదయం ఆరు గంటలకే పంపిణీని ప్రారంభించాలని సూచించారు. అదే విధంగా నీటి వినియోగదారు సంఘాల ఎన్నికలపైనా నిధి మీనా సూచనలు చేశారు.
సమావేశంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీపీవో లావణ్య, ఎన్ఎస్‌పీ-ఇరిగేషన్ ఎస్ఈ శివరామకృష్ణ, స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి
తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News