మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనకు నైపుణ్య గణన ఎంతో ఉపయోగపడుతుందని, ఈ సర్వేకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నిర్వహించిన కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి అయిదు సంతకాలలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) ఒకటని, యువతకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సర్వేను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య గణన తొలుత పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో నిర్వహించారని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు అక్కడ నైపుణ్య గణనలో పనిచేసిన వారు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరిస్తూ జిల్లాలో ప్రతి మండలం నుంచి ఇద్దరి చొప్పున ఎంపిక చేసిన సచివాలయ సిబ్బందికి మండల స్థాయిలో శిక్షణ ప్రారంభించటం జరిగిందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని మిగిలిన సచివాలయ సిబ్బంది శిక్షణ ఇస్తారని తెలిపారు.
తొలుత జిల్లాలోని ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, డిప్లమా కళాశాలలను గుర్తించి అక్కడి విద్యార్థులకు నైపుణ్య గణన ప్రాముఖ్యతను వివరించి స్వీయ గణన చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సర్వేలో ప్రధానంగా విద్యార్హతలు, నైపుణ్యాలు, ప్రస్తుత ఉపాధి వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులు, ఆకాంక్షలు తదితర ప్రశ్నల ద్వారా ప్రత్యేకంగా రూపొందించబడిన నైపుణ్యం మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారం సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇంటింటికి వెళ్లి 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఒక్కరికి సర్వే చేపట్టి డేటా సేకరించాలని, దీనిపై ఎవరికి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసి నైపుణ్య గణన ఉపయోగాలను వారికి ఓపిగ్గా వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ రవికాంత్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.