-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరుత్సాహపరిచిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అరకొర నిధులు, అంకెల గారడీతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించిందన్నారు. రూ. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినా.. ఏ రంగానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేకపోయిందన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతకు ఈ బడ్జెట్ తో ఒరిగేదేమీ లేదన్నారు. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, రైతు సంక్షేమానికి సరిపడా ఎక్కడా కేటాయింపులు లేవని.. సూపర్ సిక్స్ పథకాల ఊసే కానరాలేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఆడంబరాలపై ఉన్న శ్రద్ధ.. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలపై లేదని ఈ సందర్భంగా మరోసారి రుజువైందన్నారు. పైగా నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని.. ఖర్చులు, జమ అయిపోయిన తరుణంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో మే 30న వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే, కేవలం నెలన్నర రోజుల్లో జూలై 12న బడ్జెట్ ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం పథకాలకు కేటాయింపులు లేకుండానే బడ్జెట్ ను రూ. 41 వేల కోట్లు పెంచేసిందని విమర్శించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ లో విజయవాడ నగరానికి మొండిచేయి చూపారని మల్లాది విష్ణు ఆరోపించారు. గుణదల ఫ్లైఓవర్, బుడమేరు ఆధునికీకరణ, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టవలసిన రహదారులు, డ్రెయిన్లు, ఇతర మరమ్మతులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని.. మసిపూసి మారేడు కాయలాగా బడ్జెట్ ఉందని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు.